లక్ష్యం వైపు అడుగులు | AP Government Introduced New Policy for School Students | Sakshi
Sakshi News home page

లక్ష్యం వైపు అడుగులు

Published Fri, Aug 2 2019 10:07 AM | Last Updated on Fri, Aug 2 2019 10:07 AM

AP Government Introduced New Policy for School Students - Sakshi

విద్యార్థి సమాచార దీపిక మొదటి, ఆఖరి పేజిలు 

సాక్షి, శ్రీకాకుళం : చదువుకున్న చదువుకు ఎలాంటి ఉద్యోగం వస్తుంది. ఇష్టమైన ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి చదువులు, కోర్సులు చేయాలి. ఎలా చదవాలి. ప్రిపరేషన్‌ మార్గాలేంటి..? ప్రతి విద్యార్థిని వేధించే ప్రశ్నలివి. వీటికి సమాధానంగా విద్యాశాఖ సరికొత్త పుస్తకాన్ని తయారుచేసి విద్యార్థులకు అందిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు పాఠశాలల్లో చదవుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు పుస్తకాలను రూపొందించింది. 

సమగ్ర విశ్లేషణతో..
రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీవన నైపుణాలు, కెరీర్‌ గైడెన్స్‌ తదితర అంశాలపై విద్యార్థి సమాచార దీపిక పేరిట సమగ్ర విశ్లేషణ పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థికి ఒక పుస్తకం వంతున వీటిని పంపిణీ చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాలకు అనుగుణంగా ఎటువైపు వెళ్లాలో అవగాహన కల్పించడానికి ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పుస్తకాలను జిల్లాలోని 483 ప్రభు త్వ ఉన్నత పాఠశాలలకు ఇటీవలి పంపిణీ చేశారు. మరికొన్ని ఆర్‌ఎంఎస్‌ఏ కార్యాలయంలో ఉన్నాయి. 

52 వేల మందికి లబ్ధి
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు జిల్లాలో దాదాపు 52 వేల మంది ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ పుస్తకాలను పం పిణీ చేశారు. ఉపాధి కోర్సుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాం తాల్లోని విద్యార్థులు చదువుతుంటారు కాబట్టి ఉపాధి కోర్సులపై పెద్దగా అవగాహన ఉండదు. చదువుకునే సమయంలో వారికి పాఠశాల స్థాయిలో అవగాహన కల్పిస్తే లక్ష్య సాధన కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. 

28 పేజీలతో కూడిన పుస్తకంలో..
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న  విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ ఒకటి చొప్పున కరదీపికను అందజేస్తారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా ఉచితంగానే అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 28 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో జీవన నైపుణ్యాలపై విశ్లేషణా త్మకమైన విషయాలు ఉంటాయి. ఏ తరహా జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి, కెరీర్‌ గైడెన్స్‌ అంశాలను రెండు విభాగా లుగా ఏర్పరిచారు. కేవలం చదువు ఒక్కటే కాదు, చదువు పూర్తి చేశాక ఏ తరహా ఉపాధి అవకాశాలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన ఉంటే విద్యపై మరింత ఆసక్తి, ఉత్సాహం పెరుగుతుందనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు అనుగుణంగా విద్యార్థి సమాచర దీపికలో విషయాలను పొందుపర్చారు.

టెన్త్‌ తర్వాత గమ్యం ఎటువైపు..?
సమాచార దీపిక ముఖ్యంగా టెన్త్‌ క్లాస్‌ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ గమ్యం ఎటువైపో దిశానిర్దేశం చేయగలదు. టెన్త్‌ తర్వాత ఏది చదవాలో తెలుసుకునేందుకు వివిధ కోర్సులను స్పష్టంగా దీపికలో పేర్కొన్నారు. టెన్త్‌ తర్వాత ఇంటర్మీ డియెట్, వృత్తివిద్య, పాలిటెక్నిక్, ఐటీఐ, డిప్లమో ఇన్‌ అగ్రికల్చర్, డిప్లమో ఇన్‌ హార్టీకల్చర్, ఏపీఆర్‌జేసీ, ఏపీఎస్‌డబ్ల్యూ ఆర్జేసీ, ఏపీటీడబ్ల్యూ ఆర్జేసీ, ట్రిపుల్‌ ఐటీ, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ డిజైనింగ్

ఇంటీరియల్‌ డిజైనింగ్, డిఫెన్స్‌ అండ్‌ ఆర్మీ, పైలట్, డాక్టర్, ఫార్మాసిస్టు, పారా మెడికల్‌ కోర్సులు, నర్సింగ్, అగ్రికల్చర్, చార్టడ్‌ అకౌంటెంట్, ఎంబీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్, టీచర్, పోలీస్, లాయర్, సైంటిస్ట్, ఫైన్‌ ఆర్ట్స్, పీఈటీ, కోచ్, సోషల్‌ వర్క్, బ్యాంకింగ్, జర్నలిజం, సివిల్‌ సర్వీసెస్, ప్రభుత్వ వసతి గృహాలు, 16 రకాలైన ఉపకార వేతనాలు, దూరవిద్య, ఇలా వివిధ అంశాల ను పుస్తకంలో పొందుపర్చారు. అదే విధంగా కోర్సు పేరు, ప్రవేశం ఎప్పుడు వస్తుంది. ఏ కోర్సులకు ఎలాంటి ఉద్యోగా లు వస్తాయో కూడా విపులంగా పొందుపర్చారు. ఈ పుస్తకం ద్వారా 9, 10 తరగతులు చదువుతున్న సందర్భంలోనే విద్యార్థులకు ఇష్టమైన రంగంలో స్థిరపడటానికి మార్గం సుగమం చేయాలనేదే విద్యార్థి సమాచార దీపిక ఉద్దేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement