
ఏపీ సర్కారుకు సుప్రీం మొట్టికాయలు
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ అంశంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులకు పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన మంచినీరు, బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, సబ్జెక్టుల వారీగా విద్యను భోదించేందుకు అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉండాలని, ఇవి లేనట్లయితే అది మొత్తం విద్యా వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. విద్యను భోదించే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే.. దేశానికి ఉత్తమ పౌరులను అందించడం అసాధ్యమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించింది.
బాలలకు విద్యను భోదించే ప్రదేశాల్లో మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం అనేది కనీస మానవహక్కుల్లో భాగమని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ వి గోపాలగౌడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై 2012 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించకపోవడంపై దాఖలైన ధిక్కార పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది.