సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియామకమైన బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గవర్నర్ తన 85వ జన్మదిన వేడుకలను శనివారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు, పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గమ్మ దేవస్థానం వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం అందిస్తారు.
తదుపరి గిరిజన, దళిత బాలబాలికల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు గవర్నర్ నూతన వస్త్రాలు, నోట్ పుస్తకాలు బహుకరిస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని పెంపొందించే కూచిపూడి ప్రదర్శనతో సహా పలు కార్యక్రమాలు ఉంటాయి. చివరగా నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరంను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రభుత్వం తరపున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు రాజ్ భవన్‌కు వచ్చి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతారు.
Comments
Please login to add a commentAdd a comment