![74th Republic Day Celebrations At Vijayawada Indira Gandhi Stadium - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/26/Governor1.jpg.webp?itok=nnTad1HX)
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
వేడుకల్లో గవర్నర్ ప్రసంగిస్తూ ఏపీలో ప్రభుత్వ పథకాలు భేష్ అని ప్రశంసించారు. డీబీటీ ద్వారా నవరత్నాలు, అమ్మ ఒడి పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని గవర్నర్ అన్నారు. ‘‘జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్ కిట్ అందిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సీబీఎస్‌ఈ సిలబస్ అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’’ అని బిశ్వభూషణ్ అన్నారు.
‘‘వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రూ.2750 సాయం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. త్వరలో సంచార పశువైద్య క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాం. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నాం’’ అని గవర్నర్ పేర్కొన్నారు.
‘‘కుల,మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికీ వెళ్తున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది’’ అని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment