
రైతులు అయిదేళ్లు ఎదురు చూడాలి!
హైదరాబాద్: రుణమాఫీ పథకం రైతులను నిరాశపరిచేవిధంగా ఉంది. వారి రుణం మొత్తం మాఫీ కావాలంటే అయిదేళ్లు ఆగాలి. అప్పటి వరకు ప్రభుత్వం ఎంత రుణబకాయి చెల్లించిందో అంత మాత్రమే కొత్త రుణం ఇస్తారు. బకాయి పూర్తిగా చెల్లించని రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రతి ఏటా 20 శాతం నిధులు రైతుల ఖాతాలలో జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రైతులకు 20 శాతం కొత్త రుణం లభించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
రుణ మాఫీ కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ పేరుకు ఏపి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్పోరేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి కావస్తుంది. ఈ నెల 10వ తేదీ నాటికి బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల సమాచారం వంద శాతం రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ లోపల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. లబ్ది పొందవలసిన రైతు కుటుంబాలు మొత్తం 42 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఈ నెల 22వ తేదీ నాటికి 20 శాతం నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేటాయించిన నిధుల మేరకు ఈ నెల 30 వరకు కొత్త రుణాలు మంజూరుకు ఆర్థిక శాఖ గడువు కోరింది.
**