'వంశధార'పై దిగొచ్చిన బాబు సర్కార్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిర్వాసితులకు మంగళవారం చెక్కుల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు విడుదల చేసింది.
చదవండి : (వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత)
గత కొద్దికాలంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాడలి, తులగాం, దుగ్గుపురంలో వంశధార రిజర్వాయర్ పనులను నిర్వాసితులు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేంత వరకు ప్రాజెక్టు పనులను జరగనివ్వబోమని హెచ్చరించారు. స్థానికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు పలుమార‍్లు విఫలం కావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. నిర్వాసితుల సమస్యలపై ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో బాబు సర్కార్ నష్టం పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.