
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఎంత కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తన నైజం అని మరోసారి నిరూపించుకున్నారు యువ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికల మ్యాని ఫెస్టోలో పేర్కొన్న విధంగానే ముఖ్యమంత్రి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ కేటాయింపుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళలకు 50 శాతం దక్కేలా చర్యలు తీసుకోనున్నట్లు ఇటీవల కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ వర్గాలకు పెద్దపీట వేశారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కిననాడే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పిన నాయకుల వాక్కులను నిజం చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల్లో ఆనందోత్సాహలు వ్యక్తమవుతున్నాయి.
స్వాతంత్య్ర వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా నేటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడే ఉన్నారు. ఆయా వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే ఇప్పటివరకూ వివిధ రాజకీయ పార్టీలు పరిగణిస్తూ వచ్చాయి. దీంతో అభివృద్ధికి నోచుకోని ఈ వర్గాలు కేవలం పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోయారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో ఈ వర్గాలకు చెందిన వారు పల్లకీలు ఎక్కేస్థాయికి వచ్చారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది.
ఇప్పటివరకూ హామీలకే పరిమితం
ఇప్పటివరకూ ప్రభుత్వాలు, వాటి పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తామంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చినవారే తప్ప నిజంగా వారి అభివృద్ధికి చేసింది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం కాగితాలపై ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, ఇస్తాము అంటూ కాకి లెక్కలకే పరిమిత మవుతూ వచ్చాయనేది ఆయా వర్గాల వాదనగా ఉండేది. దీనికి భిన్నంగా యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు నామినేటెట్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50 శాతం కేటాయింపులు చేయడం నిజంగా గొప్ప చరిత్రాత్మకమైన విషయమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అంబేద్కర్ ఆశయం సిద్ధించినట్లే
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడం ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం సిద్ధించినట్లే. అట్టడుగు పేదలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక లబ్ధి చేకూరితేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా అందినట్లు అవుతుంది.
– డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఆల్‌ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అ«ధ్యక్షులు
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు
వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇచ్చిన మాటను కేవలం నెలన్నర రోజుల్లోనే నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
– ఉక్కుసూరి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు, జిల్లా యాదవ సంఘం
మహిళలకు పెద్ద పీట వేశారు
ఇప్పటివరకూ మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతూనే ఉన్నా అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఖచ్చితంగా 50 శాతం మహిళలకు అందిస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
– మెతిక రాఘవ, బీసీ సంఘం నాయకురాలు
జనాభా ప్రాతిపదికపై పదవులు కేటాయించాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఇదే క్రమంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనులు కేటాయింపులు చేసే టప్పుడు ఆయా కులాల జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 25 లక్షల మంది ఉన్న రజకులకు మేలు జరుగుతుంది.
– చిలకలపల్లి కట్లయ్య, అధ్యక్షులు, జిల్లా రజక జన సంఘం
Comments
Please login to add a commentAdd a comment