అనంతకు వైద్య విద్యార్థుల మృతదేహాలు | AP Govt Helped to Bring Telugu students Bodies From Philippines | Sakshi
Sakshi News home page

అనంతకు వైద్య విద్యార్థుల మృతదేహాలు

Published Fri, May 1 2020 2:01 PM | Last Updated on Fri, May 1 2020 2:05 PM

AP Govt Helped to Bring Telugu students Bodies From Philippines - Sakshi

సాక్షి, అనంతపురం:  ఫిలిప్పిన్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వంశీకృష్ణ, రేవంత్‌కుమార్‌ మృతదేహాలు అనంతపురం జిల్లాకు చేరాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఇద్దరు వైద్య విద్యార్థుల మృతదేహాలు ఇండియాకు తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 6న ఫిలిప్పిన్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వంశీకృష్ణ, రేవంత్‌కుమార్‌ మృతిచెందారు. 

ఎంబోజింగ్‌ సిస్టం ద్వారా మృతదేహాలు కుళ్లిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఫిలిప్పిన్స్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షల రూపాయలు వెచ్చించి వైద్య విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించారు. తమ పిల్లల మృతదేహాలు అప్పగించేందుకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు, కేంద్రప్రభుత్వ పెద్దలకు మృతుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

కదిరిలో రేవంత్‌ కుమార్‌, యాడికి మండలం నిట్టూరులో వంశీకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.  ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు విద్యార్థుల మృతదేహాలకు నివాళులు అర్పించారు. 

అసలేం జరిగిందంటే?
కదిరి పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో ఉంటున్న ఎల్‌ఎల్‌వీ క్లాత్‌ సెంటర్‌ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్‌(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్‌ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు.

వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌తో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా.. వారి మృతదేహాలు భారత్‌కు రావడం కష్టంగా మారింది. 

సీఎం జగన్‌ చొరవ..
ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు త్వరగా తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఖర్చుకు వెనకాడవద్దని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్‌ కుమార్‌ మృతదేహాలను రాష్ట్రానికి రప్పించడంపై విదేశాంగశాఖ మంత్రికి సీఎం లేఖ రాసి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement