
ప్రజలకు లబ్ధి చేకూర్చే ఒక్కో పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లు ఉంది. ఇప్పటికే ‘బంగారుతల్లి’ పథకానికి టీడీపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. తాజాగా గిరిపుత్రుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిపుత్రిక కల్యాణ పథకాన్నిఅటకెక్కించే దిశగా సన్నాహాలు చేస్తోంది.
రాయచోటి రూరల్ :
గిరిజనుల సంక్షేమమే ధ్యేయం అంటూ పలు బహిరంగ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే వారికోసం ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ వారికి తీరని ఆవేదనను మిగుల్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనుల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి, వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ‘గిరిపుత్రిక కల్యాణ పథకం’ పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆడపిల్ల వివాహ ఖర్చులకు రూ. 50 వేలను ప్రభుత్వం అందజేస్తుంది. అయితే ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు గడిచినా ఇంత వరకు పథకం గురించి తమకేమాత్రం తెలియదని అధిక శాతం మంది గిరిజనులు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పథకం దరఖాస్తు ఇలా: పథకం ప్రకారం 18 ఏళ్లు వయసు నిండి, సంవత్సర ఆదా యం రూ.2.50 లక్షల లోపు ఉండాలి. కుల, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో 01.04.2015 లోపు వివాహం అయిన గిరిజన అమ్మాయిల పేరుతో తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైబడి ఎరుక, యానాది, సుగాలి జనాభా ఉన్నారు. సుమారు 20 వేల కుటుంబాలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా, ఎలాంటి ప్రోత్సాహకం అందడంలేదని సమాచారం. లబ్ధిదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తు చేసుకున్న వారికి లబ్ధి చేకూర్చాలని అర్హులు కోరుతున్నారు.
పథకం ఉన్నట్లు తెలీదు..
గిరిజనుల పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.50 వేలు ప్రభుత్వం ఇస్తుందని.. మా కోసం ఓ పథకం ఉందని ఇప్పటికీ తెలీదు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి మాలాంటి నిరుపేదలకు పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి.
– సేలం రెడ్డెమ్మ, ఎస్టీ కాలనీ, మోటకట్ల
పూట గడవడమే కష్టంగా ఉంది
మాలాంటి కుటుంబాలకు పూట గడవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి మేము రూ. లక్షలు వెచ్చించి ఆడపిల్లల పెళ్లి చేయలేకపోతున్నాం. ప్రభుత్వం కొంతలో కొంత రూ.50వేలను అందజేస్తే ఉపశమనంగా ఉంటుంది. అధి కారులు ఇంతవరకూ ఇటువైపు వచ్చి పథకం గురించి చెప్పనే లేదు.
– ఎస్ నాగరత్నమ్మ, ఎస్టీ కాలనీ, మోటకట్ల
Comments
Please login to add a commentAdd a comment