పచ్చ నేతల కోసం కొత్తగా టెండర్లు
హంద్రీ - నీవా పనుల విలువ పెంపు
పాత కాంట్రాక్టరే పనులు చేస్తామన్నా అంగీకరించని వైనం
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
సాక్షి, ప్రతినిధి, తిరుపతి : తమకు అనుకూలంగా ఉన్న వారికి అడ్డంగా దోచిపెట్టేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే ఇసుక నుంచి రోడ్ల కాంట్రాక్ట్ వరకు అన్ని పనులూ తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు హంద్రీ-నీవా పనుల్లోనూ చక్రం తప్పింది. గతంలో పిలిచిన రూ.34 కోట్లకు రీ టెండరు పిలిచి అదే పని విలువను రూ.153 కోట్లకు పెంచేసింది. పాత కాంట్రాక్టర్ పనులు చేస్తామన్నా ఒప్పుకోక కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు తెరలేపింది. రిత్విక్, సోమా కంపెనీలు రెండే టెండర్లు దాఖలు చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
గతంలోనే రూ.60 కోట్ల పనులు పూర్తి: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనుల్లో అంతర్భాగమైన 59వ ప్యాకేజీకి సంబంధించి 2007లోనే రూ.96 కోట్లతో టెండర్లు పిలిచారు. 2011 నాటికే రూ.60 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. భూసేకరణ సమస్య అడ్డంకి కావడంతో మిగిలిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. తరువాత ఈ పనుల గురించి పట్టించుకోలేదు.
తాజా ప్రతిపాదనలు ఇలా
ప్రస్తుతం అసంపూర్తిగా 2.5 కి.మీ మేర టన్నెల్, 4 కి.మీ మేర కాలువ, గుట్టవారిపల్లె, చిప్పిలి రిజర్వాయర్ పనులు మిగిలి ఉన్నాయి. తాజాగా పిలిచిన టెండర్లలో టన్నెల్‌కు రూ.50 కోట్లు, కాలువ పనులకు రూ.50 కోట్లు, రిజర్వాయర్లకు రూ.50 కోట్లకు పైగా కేటాయించి టెండర్లు పిలిచారు. వారం రోజుల క్రితం ఈ టెండర్లు పిలిచి మంగళవారం అధికారుల సమక్షంలో తెరిచారు. రిత్విక్, సోమా రెండు కంపెనీలు మాత్రమే టెండర్ బిడ్ దాఖలు చేశాయి. ఈ టెండర్లను అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది.
పరిశీలిస్తున్నాం
పనుల కోసం దాఖలైన టెండర్లను పరిశీలిస్తున్నాం. పనుల కోసం టెండర్లు దాఖలు చేసిన కంపెనీలకు అర్హత ఉందా లేదా తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం. టెండర్ల ఖరారుకు సంబంధించి ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కాసుకో.. దోచుకో!
Published Fri, Nov 6 2015 2:41 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement