ఏలూరు గిరిజన భవన్‌లో ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ప్రక్రియను పరిశీలిస్తున్న జేసీ
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : గత ప్రభుత్వ హయాం లో ఒక్క ఉద్యోగం రాక, నోటిఫికేషన్ల కోసం ఎదరుచూసీచూసీ అలసిపోయిన నిరుద్యోగలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఊహించని వరా ల జల్లు కురిపించింది. గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల నియామకంతోపాటు గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. గత సర్కారు నిర్వాకం వల్ల వయోపరిమితి దాటిపోతుందని మదనపడిన నిరుద్యోగులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. పరీక్షలు కూడా అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వడంతో నిరుద్యోగులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివితే ఉద్యోగం గ్యారెంటీ అన్న భావనతో రేయింబవళ్లు శ్రమించి చదువుల సమరం సాగించారు. పరీక్షలకు సర్వసన్నద్ధమయ్యారు.
పరీక్షల నిర్వహణా సిబ్బంది ఇలా..
చీఫ్ సూపరింటెండెంట్లు | 365 |
అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు | 183 |
సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు | 891 |
ఇన్విజిలేటర్లు | 3,856 |
హాల్ సూపరింటెండెంట్లు | 1,293 |
931 గ్రామ, వార్డు సచివాలయాలు
జిల్లాలో 931 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 8,034 పోస్టులు ఉండగా 1,41,406 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీవరకూ జరగనున్న పరీక్షలకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 311 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విభాగాల వారీగా పరీక్షలు ఇలా..
తొలిరోజు ఉదయం 1,05,012 మంది అభ్యర్థులు పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5), కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ శాఖ సహాయకులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన 12,884 మంది అభ్యర్థులు వీఆర్వో, సర్వే అసిస్టెంట్ పోస్టులకు, ఏఎన్‌ఎం, వార్డు హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష రాయనున్నారు. 4న 2,627 మంది విలేజ్ అగ్రికల్చరల్ సెక్రటరీ పోస్టులకు, విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ పోస్టులకు, 6వతేదీన 2,159 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్‌కు, పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాయనున్నారు. 7వ తేదీన 8,052 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2)కు, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాయనున్నారు. 8న 11,075 మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఉద్యోగాలకు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటరీ అండ్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శి (గ్రేడ్–2) పోస్టులకు పరీక్ష రాయనున్నారు. మొత్తంగా ఆరు రోజులలో 1,41,406 మంది అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ పరీక్షలకు హాజరు కానున్నారు.
అక్రమాలకు తావులేకుండా..
పరీక్షలను ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తున్నారు. ప్రతి కేంద్రానికీ గెజిటెడ్ హోదా కలిగిన స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు గిరిజన భవన్‌లో శుక్రవారం ప్రశ్నాపత్రాలు భద్రపరిచారు. ఇక్కడి నుంచి పరీక్షల సామగ్రి 12 క్లస్టర్లకు తరలించి పరీక్షల అనంతరం ఏలూరు టీటీడీ హాలుకు పత్రాలు చేరే వరకు సంబంధిత ప్రత్యేక అధికారులే పూర్తి బాధ్యత వహించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు, రూట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా మార్గనిర్దేశనం చేశారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు అదనంగా 20 నిమిషాలు అనుమతిస్తారు. పరీక్ష నిర్వహణ తేదీల్లో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
మరోవైపు ఆర్టీసీ కూడా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి బస్టాండ్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ముఖ్యమైన పరీక్షా కేంద్రాల వద్ద వలంటీర్లను పెట్టాలని, పరీక్షలు జరిగే రోజు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ అనే భేదం లేకుండా అభ్యర్థులు కోరిన చోట బస్సులు ఎక్కించుకోవడం, దించడం చేయాలనే ఆదేశాలు సిబ్బందికి జారీ చేసింది. ఒక్క సెప్టెంబరు 1వ తేదీనే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరీక్షలకు హాజరు అవుతున్నందున 8 డిపోల నుంచి పరీక్షా స్పెషల్స్ పేరుతో 65 బస్సులతోపాటు నిత్యం జిల్లా మొత్తం తిరిగే 540 బస్సులను కలిపి మొత్తంగా 605 బస్సులు తిప్పనుంది.
Comments
Please login to add a commentAdd a comment