సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దు విషయంలో నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. అలాగే ప్రాజెక్టు పనుల్ని థర్డ్ పార్టీకి అప్పగించకుండా ఉత్తర్వులిచ్చేందుకూ నిరాకరించింది. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చునంది. అయితే టెండర్లను మాత్రం ఖరారు చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పదకొండేళ్లక్రితం ఒప్పందం కుదుర్చుకుని, వందల ఎకరాల భూమి అప్పగించినా పనులు ప్రారంభించకపోవడంతో మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపేయడంతోపాటు ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు.
నవయుగ అనుబంధ పిటిషన్‌పై ఎటువంటి సానుకూల ఉత్తర్వులు జారీ చేయట్లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, ఈ విషయంలో న్యాయస్థానం ఏ రకంగానూ జోక్యం చేసుకోదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని, అందువల్ల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాకపోవడంతో మధ్యంతర ఉత్తర్వుల పూర్తి పాఠం తెలియరాలేదు.
‘నవయుగ’కు చుక్కెదురు..
Published Wed, Oct 2 2019 4:23 AM | Last Updated on Wed, Oct 2 2019 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment