
ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు!
- ఓటుకు నోటు టేపులను పసిగట్టలేకపోయారని సీఎం ఆగ్రహం
- ఆమెను తప్పించాలని చంద్రబాబు నిర్ణయం
- మరో ఇద్దరి పేర్లు సూచించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ నిఘా విభాగం చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారం ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారనే సాకుతో అనురాధను తప్పించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
మంగళవారం నిర్వహించిన అత్యవసర కేబినెట్ భేటీకి ఏపీ పోలీసు ఉన్నతాధికారులను కూడా పిలిచారు. అందరి సమక్షంలో అనురాధ పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక, కార్మిక శాఖల మంత్రులు సైతం ఆమెను పలు ప్రశ్నలు వేస్తూ నిలదీశారు. ఈ సందర్భంగా అనురాధ కూడా ఘాటుగానే స్పందించారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. నోట్ల కట్టలు అందించిన వ్యవహారంలో తమ వైఫల్యం ఏమాత్రం లేదని ఘాటుగానే స్పందించారు.
తెలంగాణ అధికారులు, మంత్రులపై తాము నిఘా ఉంచితే, ఆ విషయం బయటకు పొక్కితే ఇప్పుడు ఏపీ మంత్రులు చెబుతున్నట్టే అప్పుడు తెలంగాణ అధికారులు, మంత్రులు తమపై కేసులు పెట్టే ప్రమాదం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిం చారు. తర్వాత అనురాధ అర్థంతరంగా సమావేశం నుంచి బయటకు రావడమే కాకుండా తన అధికార వాహనాన్ని అక్కడే వదిలి మరో వాహనంలో వెళ్లిపోయారు.
అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మరొకరి పేరును సూచించాలని డీజీపీ ని సీఎం ఆదేశించారు. దాంతో ఆయన సీహెచ్ ద్వారకా తిరుమలరావు, గౌతమ్ సవాంగ్ పేర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న తిరుమలరావు ఇంటెలిజెన్స్ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా లేకపోవడంతో ఏపీఎస్పీ అదనపు డీజీగా ఉన్న సవాంగ్ పేరును పరిశీలించారు.
మార్పుపై మల్లగుల్లాలు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో అనురాధను మార్చడం వల్ల తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుందని, టేపుల విషయంలో ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నందున ఇంటెలిజెన్స్ చీఫ్‌ను ఎందుకు మార్చారనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంటుందనే చర్చ కేబినెట్లో జరిగినట్లు తెలిసింది. మరోపక్క కొంత మంది మంత్రులతో పాటు కీలక అధికారుల్లో ఓ వర్గం అనురాధకు మద్దతు పలుకుతోంది.
కేబినెట్ సమావేశానంతరం కొందరు ‘ముఖ్యులు’ సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. వీరు కొన్ని ‘ప్రత్యేక అంశాలను’ సీఎంకు వివరించి అనురాధను మార్చవద్దని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం వరుస వైఫల్యాల నేపథ్యంలో అనురాధను బదిలీ చేయాల్సిందే అని ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె మార్పు అంశంపై ప్రభుత్వం, పోలీసు విభాగం మల్లగుల్లాలు పడుతోంది.