ఏపీఎండీసీ ఆంధ్రప్రదేశ్‌కే!
కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్రం సింగరేణిలా 12వ షెడ్యూలులో చేర్చాలని వినతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) విభజనపై పీటముడి పడేలా ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించాలని రాజకీయపరమైన డిమాండ్ బలం పుంజుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీఎండీసీ ఆస్తులన్నీ ఆంధ్రకే చెందుతాయని, ఇందుకు అనుగుణంగా సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంస్థకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం, రూ.వెయ్యి కోట్లకుపైగా సంస్థకు ఆస్తులు ఉండటం, ఇవన్నీ ఏపీ నుంచి సమకూరినవే కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై పట్టుపడుతోంది. ఏపీఎండీసీ ఆస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు 52:48 దామాషాలో పంచుకునేలా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించిన విధంగానే ఏపీఎండీసీని ఏపీకి వదిలివేయాలని ఆ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.
సింగరేణి తెలంగాణకు దక్కేలా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 12వ షెడ్యూలులో చేర్చారు. ఏపీఎండీసీని మాత్రం తొమ్మిదో షెడ్యూలులో చేర్చారు. ఏపీఎండీసీకి ఆస్తులన్నీ వైఎస్సార్ జిల్లాలోని మంగంపేట, ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ నుంచి సమకూరినవే. సంస్థ వార్షికాదాయంలో 95 శాతంపైగా ఈ ప్రాంతం నుంచే వస్తోంది. దీనితోనే అమీర్‌పేటలో సంస్థకు భవనాన్ని కొనుగోలు చేశారు. అందువల్ల ఏపీఎండీసీ పూర్తిగా ఏపీకి చెందేలా చూడాలని ఆ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.