Andhra Pradesh Mineral Development Corporation
-
‘సీఎం జగన్ ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించారు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) చైర్‌పర్సన్‌గా షమీమ్ అస్లాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంకు చేరుకున్న షమీమ్ అస్లాంకు ఏపీఎండీసీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి అభినందలు తెలియచేశారు. అనంతరం ఏపీఎండీసీ చైర్ పర్సన్ ఛాంబర్లో ఫైల్‌పై సంతకం చేసి, అధికారికంగా షమీమ్ అస్లాం బాధ్యతలు స్వీకరించారు. ఆమె సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకు చేస్తున్న కృషి, మహిళా శక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే తనకు ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ఏపీఎండీసీని మరింత ముందుకు తీసుకువెడతానని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతను అందించడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా తనపై ఎంతో నమ్మకంతో సీఎం వైఎస్ జగన్ ఈ బాధ్యతను ఉంచారని, దీనిని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఏపీఎండీసీ ప్రభుత్వరంగ సంస్థగా అందరికీ ఆదర్శప్రాయంగా ప్రగతిపథంలో నడిచేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఏపీఎండీసీ విశేషమైన కృషి చేస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో మన ఖనిజాలకు మంచి మార్కెట్‌ను సాధించి తన ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. ఏపీఎండీసీ ద్వారా అటు ప్రభుత్వానికి ఖనిజ సంపద ద్వారా ఆదాయాన్ని అందించడానికి, ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అన్ని అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఏపీఎండీసీ కార్యాలయ అధికారులతో భేటీ అయ్యారు. సంస్థ పురోభివృద్ధికి ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సంస్థకు చేయూత లభించేలా చేయడంతో పాటు, అటు పర్యావరణం, ఇటు ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవకాశాలను కూడా సమన్వయం చేసుకుంటూ సంస్థను ముందుకు తీసుకువెళ్ళేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఎండిసి జాయింట్ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, కంపెనీ సెక్రటరీ ఆర్ మణికిరణ్, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎస్వీసీ బోస్, జనరల్ మేనేజర్ (కోల్) లక్ష్మణరావు, వీసీ అండ్ ఎండీ ఓఎస్డీ శ్రీవెంకటసాయి, డీజీఎం (జియాలజీ) నతానియేలు, డీజీఎం (సివిల్) శంభుప్రసాద్, ఎఫ్ అండ్ ఏ శ్రీనివాసమూర్తి, డీజీఎం (హెచ్ఆర్డీ) పి. సత్యనారాయణమ్మ, డీజీఎం (సీఎస్ఆర్) రాజారమేష్, ఎఫ్ అండ్ ఏ దేవిమంగ తదితరులు పాల్గొన్నారు. -
నచ్చిన వారికి మెచ్చినంత!
సాక్షి, అమరావతి: పేరుకు అదో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. కానీ పారదర్శకతకు, ప్రభుత్వ నిబంధనలకు అక్కడ చోటే లేదు. మేనేజింగ్ డైరెక్టర్ మాటే వేదం. ఆయన ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా తనకు కావాల్సిన వారికి ముఖ్యమైన కాంట్రాక్టు పోస్టులిచ్చేస్తుంటాడు. అందులో తనకు నచ్చిన వారికి మెచ్చినంత వేతనం కూడా.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)లో సాగుతున్న తంతు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ముసుగులో ఒకే సామాజికవర్గం వారికి భారీగా పోస్టులు కట్టబెట్టారు. అత్యధిక పారితోషికమిచ్చే కాంట్రాక్టు పోస్టుల్లో దాదాపు ఒకే సామాజిక వర్గం వారే ఉన్నారని.. తమపై పెత్తనం చెలాయిస్తున్నారని మరోవైపు రెగ్యులర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు పాతర.. ముఖ్యమైన పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బందిని పెట్టకూడదంటూ ప్రభుత్వ నిబంధనలున్నాయి. దీన్ని కాలరాస్తూ ఏపీఎండీసీలో పలు కీలక(కోర్) పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బందిని పెట్టారు. రెగ్యులర్ సిబ్బందిపై ఈ కాంట్రాక్టు సిబ్బంది పెత్తనం చెలాయిస్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అండదండలుండటంతో రెగ్యులర్ సిబ్బంది ఏమీ మాట్లాడలేక మౌనంగా భరిస్తున్నారు. ఏ సంస్థలో అయినా మానవ వనరుల అభివృద్ధి విభాగం చాలా ముఖ్యమైనది. ఉద్యోగుల పనితీరుపై రికార్డులు రూపొందించడం, నిర్వహించడం ఈ విభాగం బాధ్యతల్లో ముఖ్యమైనవి. ఉద్యోగుల పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, బదిలీల సమయంలో కూడా ఈ విభాగం నివేదికలకు ప్రాధాన్యముంటుంది. ఇంతటి కీలక విభాగం జనరల్ మేనేజరు(జీఎం, హెచ్ఆర్డీ) బాధ్యతలను రెండేళ్లుగా ఎ.వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నియమించిన ఈ ఉద్యోగికి నెలకు రూ.లక్ష పారితోషికం చెల్లిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ సంస్థలో లేనివిధంగా.. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఇంత అడ్డగోలుగా అధిక పారితోషికంతో కాంట్రాక్టు సిబ్బందిని నియమించిన దాఖలాల్లేవు. ఏ సంస్థలోనైనా పెద్ద పోస్టుల్లో పనిచేసే సిబ్బంది కొరత ఉంటే.. ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై తెచ్చుకోవాలి. ఖాళీల గురించి ప్రభుత్వానికి సిఫారసు చేసి భర్తీ చేయించుకోవాలి. ఏపీఎండీసీలో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నా.. వీటిని భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా డిప్యుటేషన్‌పై కూడా తెచ్చుకోవడం లేదు. నిబంధనలను గాలికొదిలేసి అత్యధిక పారితోషికంతో నచ్చిన వారిని నియమించుకున్నారు. సంస్థ ఉన్నతాధికారి సామాజిక వర్గం వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. పైగా కీలక పోస్టుల్లో వీరిని పెట్టారు. కోల్(బొగ్గు)కు సంబంధించిన జనరల్ మేనేజర్ (జీఎం) పోస్టు అత్యంత కీలకమైనది. రూ.వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే జీఎం పోస్టులో కాంట్రాక్టు ఉద్యోగి అనంతనేని లక్ష్మణరావును నియమించారు. నెలకు రూ.లక్ష పారితోషికంతో రెండేళ్లుగా ఆయన ఈ స్థానంలో ఉన్నారు. ఎన్.వెంకటేశ్వరరావు అనే మరో కాంట్రాక్టు ఉద్యోగిని బొగ్గు విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా రెండేళ్లుగా కొనసాగిస్తునే ఉన్నారు. ఇలాంటి కీలక పోస్టులన్నీ ఇష్టారీతిన అప్పగించేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఖాళీల భర్తీకి చర్యలేవీ? ఏపీఎండీసీలో 481 మంది ఉద్యోగులుండాలి. కానీ ప్రస్తుతం 128 మందే ఉన్నారు. మరో 353 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘బాబు వస్తేనే జాబు’ అంటూ 2014 ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన కార్యాలయంలో పనిచేసే వెంకయ్య చౌదరినే ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంపించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ ఒక్క పోస్టును కూడా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయలేదు. ఈ సంస్థలో ఏకంగా 643 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయిస్తుండటం గమనార్హం. మరోవైపు పారదర్శకంగా వ్యవహారాలు సాగుతున్నాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతుండగా.. వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది. అధిక పారితోషికమిచ్చే పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోవడమే పారదర్శకతకు పాతరేశారనేందుకు నిదర్శనమని పలువురు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీఎండీసీ ఎండీగా షాలినీ మిశ్రా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు ఎండీగా షాలినీ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చే శారు. ప్రస్తుతం షాలినీ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగుతారు. సెర్ప్ సలహాదారుగా రామలక్ష్మి సెర్ప్ కన్సల్టెంట్‌గా ఇటీవల నియమితులైన రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి రామలక్ష్మి హోదాను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ కన్సల్టెంట్‌కు బదులుగా సెర్ప్ సలహాదారు హోదాలో ఆమె విధులు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఇసుకకు కొత్త ధరలు ప్రతిపాదించండి
ఏపీఎండీసీ ప్రతిపాదించిన ధరలను తిరస్కరించిన ప్రభుత్వం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీఎండీసీ) ప్రతిపాదించిన ఇసుక ధరలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదించిన ధరలు బాగా తక్కువగా ఉన్నాయని కొత్త ధరలను రూపొందించాలని కోరింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం కొత్త ఇసుక విధానం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఇసుక విధానం ప్రకారం ఇసుక ధరలను ఖరారు చేసే బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించగా.. వారు ఈ నెల 4వ తేదీన ఇసుక ధరలను నిర్ణయించి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచింది. పొక్లెయిన్ వంటి మిషన్ల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌లో టన్ను ఇసుక ధర రూ. 157గా .. పూర్తిస్థాయిలో మనుషుల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌ల వద్ద టన్ను ఇసుక రూ. 211గా ప్రతిపాదించారు. మిషన్లు, కూలీలను సమంగా ఇసుకకు టన్ను ఇసుక ధరను రూ. 177గా ప్రతిపాదించారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే అమ్మకాలు నిర్వహించే డ్వాక్రా సంఘాలకు 25 శాతం మేర చెల్లించాల్సి ఉందని.. దీనికి తోడు రైతు రుణమాఫీకి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సాధికారిత సంస్థకు ఇసుక అమ్మకాల నుంచి భారీగా నిధులు జమ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులు ఏపీడీఎంసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనితో కొత్త ప్రతిపాదనలపై దృష్టి పెట్టారు. -
ఏపీఎండీసీ ఆంధ్రప్రదేశ్‌కే!
కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్రం సింగరేణిలా 12వ షెడ్యూలులో చేర్చాలని వినతి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) విభజనపై పీటముడి పడేలా ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించాలని రాజకీయపరమైన డిమాండ్ బలం పుంజుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీఎండీసీ ఆస్తులన్నీ ఆంధ్రకే చెందుతాయని, ఇందుకు అనుగుణంగా సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంస్థకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం, రూ.వెయ్యి కోట్లకుపైగా సంస్థకు ఆస్తులు ఉండటం, ఇవన్నీ ఏపీ నుంచి సమకూరినవే కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై పట్టుపడుతోంది. ఏపీఎండీసీ ఆస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు 52:48 దామాషాలో పంచుకునేలా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించిన విధంగానే ఏపీఎండీసీని ఏపీకి వదిలివేయాలని ఆ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. సింగరేణి తెలంగాణకు దక్కేలా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 12వ షెడ్యూలులో చేర్చారు. ఏపీఎండీసీని మాత్రం తొమ్మిదో షెడ్యూలులో చేర్చారు. ఏపీఎండీసీకి ఆస్తులన్నీ వైఎస్సార్ జిల్లాలోని మంగంపేట, ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ నుంచి సమకూరినవే. సంస్థ వార్షికాదాయంలో 95 శాతంపైగా ఈ ప్రాంతం నుంచే వస్తోంది. దీనితోనే అమీర్‌పేటలో సంస్థకు భవనాన్ని కొనుగోలు చేశారు. అందువల్ల ఏపీఎండీసీ పూర్తిగా ఏపీకి చెందేలా చూడాలని ఆ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.