సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) చైర్‌పర్సన్‌గా షమీమ్ అస్లాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంకు చేరుకున్న షమీమ్ అస్లాంకు ఏపీఎండీసీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి అభినందలు తెలియచేశారు. అనంతరం ఏపీఎండీసీ చైర్ పర్సన్ ఛాంబర్‌లో ఫైల్‌పై సంతకం చేసి, అధికారికంగా షమీమ్ అస్లాం బాధ్యతలు స్వీకరించారు.
ఆమె సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకు చేస్తున్న కృషి, మహిళా శక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే తనకు ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ఏపీఎండీసీని మరింత ముందుకు తీసుకువెడతానని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతను అందించడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
ప్రధానంగా తనపై ఎంతో నమ్మకంతో సీఎం వైఎస్ జగన్ ఈ బాధ్యతను ఉంచారని, దీనిని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఏపీఎండీసీ ప్రభుత్వరంగ సంస్థగా అందరికీ ఆదర్శప్రాయంగా ప్రగతిపథంలో నడిచేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఏపీఎండీసీ విశేషమైన కృషి చేస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో మన ఖనిజాలకు మంచి మార్కెట్‌ను సాధించి తన ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. ఏపీఎండీసీ ద్వారా అటు ప్రభుత్వానికి ఖనిజ సంపద ద్వారా ఆదాయాన్ని అందించడానికి, ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అన్ని అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అనంతరం ఏపీఎండీసీ కార్యాలయ అధికారులతో భేటీ అయ్యారు. సంస్థ పురోభివృద్ధికి ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సంస్థకు చేయూత లభించేలా చేయడంతో పాటు, అటు పర్యావరణం, ఇటు ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవకాశాలను కూడా సమన్వయం చేసుకుంటూ సంస్థను ముందుకు తీసుకువెళ్ళేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఎండిసి జాయింట్ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, కంపెనీ సెక్రటరీ ఆర్ మణికిరణ్, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎస్‌వీసీ బోస్, జనరల్ మేనేజర్ (కోల్) లక్ష్మణరావు, వీసీ అండ్ ఎండీ ఓఎస్‌డీ శ్రీవెంకటసాయి, డీజీఎం (జియాలజీ) నతానియేలు, డీజీఎం (సివిల్) శంభుప్రసాద్, ఎఫ్ అండ్ ఏ శ్రీనివాసమూర్తి, డీజీఎం (హెచ్‌ఆర్‌డీ) పి. సత్యనారాయణమ్మ, డీజీఎం (సీఎస్‌ఆర్) రాజారమేష్, ఎఫ్ అండ్ ఏ దేవిమంగ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment