గ్రీవెన్స్‌సెల్‌కు సమైక్య సెగ
Published Tue, Feb 11 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రీవెన్స్‌సెల్‌కు సమైక్య సెగ తగిలింది. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ కార్యాలయాలనూ మూయించారు. అలాగే మిగిలిన కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించి కార్యకలాపాలను స్తంభింపజేశారు.
గ్రీవెన్స్‌సెల్‌లో హోరెత్తిన సమైక్య నినాదం
నేరుగా గ్రీవెన్స్‌సెల్ జరగుతున్న ఆడిటోరియంలోకి ఎన్జీఓలు ప్రవేశించి సమైక్య నినాదాలు విన్పించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అధికారులను కోరారు. అలాగే బయటన అర్జీలు రాస్తున్న వారిని సైతం అడ్డుకున్నారు. కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాలని పిలుపు నిచ్చారు. దీంతో కొంతమంది ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గ్రీవెన్స్‌సెల్‌ను అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. బయట అర్జీలు రాయకపోవడంతో కొంత మంది నిరాశతో వెనుదిరిగారు. దీంతో జెడ్పీ సీఈఓ మోహనరావు బయటకు వచ్చి పరిస్థితి సమీక్షించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని సమైక్యవాదులు కలెక్టర్‌ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మీ పని మీరు చేయండి.. మా పని మేము చేస్తామం’టూ బదులిచ్చారు. ఈ సందర్భంగా ఎన్జీఓ నాయకులు ప్రభూజీ, కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల వారూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్‌ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement