ఒంటిమిట్ట రాముడికి ఏపీ సర్కారు తలంబ్రాలు
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆరోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పుష్కరాలకు వెళితే పదవులు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని వివరించారు. ఈసారి గోదావరి పుష్కరాలకు భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.
తిరుమలలో రూ.300 దర్శనం టిక్కెట్లు, వసతి సదుపాయాన్నికూడా ఆన్లైన్ ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్కు దేవాదాయశాఖ భూములు ఇంకా ఇవ్వలేదన్నారు. త్వరలోనే రైతులకు ఇచ్చినట్లుగానే పరిహారం తీసుకుని ప్రభుత్వానికి భూములు అప్పగిస్తామని వివరించారు.