హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేనట్లుగా కన్పిస్తోందని ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం ఆరోపించారు. మంగళవారం ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని బలపరచిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.
తామిచ్చిన ఎన్నికల హామీని అమలు చేసేది లేదని చెబుతున్న బీజేపీ ద్రోహంలో టీడీపీ, జనసేన పార్టీలు భాగస్వామలు అవుతారో, ఆ ద్రోహాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలుస్తారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరువు సహాయం, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయాలని, ఖరీఫ్ ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఉదయం పీసీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.