- ఏపీ పోలీస్ ఆయుధాగారం తరలింపు ...
- హైదరాబాద్ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌కు మార్చాలని నిర్ణయం
- ఇప్పటికే భవనాలు పరిశీలించి ప్రభుత్వానికి లేఖ రాసిన డీజీపీ రాముడు
- భద్రతాపరంగా ఇక్కడే మంచిదనే అభిప్రాయంలో ఉన్నతాధికారులు
సాక్షి, గుంటూరు: మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏపీ పోలీస్ ఆయుధాగారం ఏర్పాటుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఈ ఆయుధాగారాన్ని గుంటూరు- విజయవాడ మధ్య ఉన్న మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌కు మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు నెలల క్రితం రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లోని కొన్ని భవనాలను పరిశీలించి, హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఆమోదం రాగానే ఆయుధాగారాన్ని ఇక్కడకు మార్చనున్నట్టు సమాచారం.
ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ఉన్న ప్రాంతంలో ఆయుధాగారాన్ని ఏర్పాటు చేయడం వల్ల భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయనేది పోలీస్ ఉన్నతాధికారుల అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలోని డీపీఓల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన ఆయుధాగారాలు ఉండటంతో కేంద్రం నుంచి వచ్చే ఆయుధాలను భద్రపరిచేందుకు దీన్ని వినియోగిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఏ జిల్లాకు ఆయుధాలు అవసరమైనా ఇక్కడి నుంచే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద రెండు వేల ఎకరాల్లో గ్రేహౌండ్స్, ఏఆర్, ఏఎన్‌ఎస్ వంటి విభాగాలతోపాటు పోలీస్ ట్రైనింగ్ సెంటర్, ఫైరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ విభాగాలన్నీ ఏర్పడితే వాటికి అందుబాటులో ఆయుధాగారం ఉండటం సౌకర్యవంతంగా ఉంటుందనే ఆలోచన కూడా పోలీస్ ఉన్నతాధికారుల్లో ఉంది.
యథాతథంగా గుంటూరులోని రీబ్రౌనింగ్ సెంటర్
1927లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం గుంటూరు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘స్టేట్ రీబ్రౌనింగ్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. దీనిలో పోలీసుల ఆయుధాలు తుప్పుపట్టకుండా ప్రత్యేక కెమికల్ ద్వారా శుభ్రపరిచి, మరమ్మతులు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందిన పోలీసులు తమ ఆయుధాలను ఇక్కడే రీబ్రౌనింగ్ చేయించుకునేవారు.
విచిత్రమేమిటంటే రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ ఆయుధాలను గుంటూరులో ఉన్న రీబ్రౌనింగ్ సెంటర్‌లోనే రిపేర్ చేయిస్తుండటం గమనార్హం. 15 ఏళ్ల క్రితం గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ మొదటి బెటాలియన్ విభాగాలు ఈ రీబ్రౌనింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఆ తరువాత వాతావరణం అనుకూలించక పోవడంతో తీసివేశారు. ఇదిలాఉంటే రీబ్రౌనింగ్ సెంటర్‌ను కూడా మంగళగిరి ఆరవ బెటాలియన్‌కు తరలిస్తారా లేక, గుంటూరులోనే కొనసాగిస్తారా అనే విషయంపై పోలీస్ అధికారుల్లో స్పష్టత లేదు. అయితే ఈ సెంటర్ ఏర్పాటుకు అన్ని చోట్లా వాతావరణం అనుకూలించదనే విషయం ఇప్పటికే రుజువు కావడంతో దీన్ని యథాతథంగా కొనసాగించాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆలోచనగా తెలుస్తోంది.
మంగళగిరిలో అమ్ములపొది
Published Fri, May 15 2015 4:53 AM | Last Updated on Mon, Aug 20 2018 1:46 PM
Advertisement
Advertisement