సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఒకే రాష్ట్రం–ఒకే సిరీస్’ విధానంతో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు సులభతరమైంది. రాష్ట్రంలో బుధవారం నుంచి ‘ఏపీ–39’ సిరీస్ అమల్లోకి వచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవ్వడమే కాకుండా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులోనూ మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టేది. అయితే కొత్త విధానం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఒకే సిరీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో రోజుకు 6 వేలకుపైగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
గురువారం సాయంత్రానికి 8,152 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రానికి ‘ఏపీ–39ఏ’ సిరీస్ పూర్తయి.. ఏపీ–39బీ సిరీస్‌లోనూ 3,153 నంబర్ల వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీ సిరీస్ 1, 9, 999 నంబర్లు రూ.50 వేలు ధర పలుకగా, 99, 333, 555, 666, 777, 888 నంబర్లు రూ.30 వేలు, 123, 222, 369, 444, 567, 786, 1111, 1116 నంబర్లకు రూ.20 వేలు చొప్పున ధర పలికింది. 3, 5, 6, 7, 111, 234, 306, 405, 789, 818, 909, 1188, 1234 తదితర నంబర్లను వాహనదారులు రూ.10 వేలు చెల్లించి తీసుకోవడం జరిగిందన్నారు. కొత్త విధానం ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ సైతం బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment