'సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేంద్రానికి తొత్తులు'
సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేంద్రానికి తొత్తులుగా మారారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని విభజిస్తే తమ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలంటూ వారు కేంద్రాన్ని అడుగుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అలాంటి వారు రాష్ట్రానికి దురదృష్టంగా మారారని ఆయన ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి ముసాయిదా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాతామని తెలిపారు. ఈ నెల 24న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందులో భవిష్యత్తు కార్యాచరణ చర్చిస్తామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపినప్పుడు రెండు అసెంబ్లీ తీర్మానాలు చేసిన సంగతిని అశోక్బాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాల్సిందే. ఆ క్రమంలో నెగ్గితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని తెలిపారు. పార్లమెంట్కు విభజన బిల్లు వస్తే దానిని అడ్డుకునేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నట్లు అశోక్బాబు వివరించారు.