ఇరుక్కుపోయిన అర్జీదారులు
తెరచుకోని డోర్లు ఆందోళనతో కేకలు
గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లి తెరుచుకున్న లిఫ్ట్
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లో ‘మీకోసం ప్రజావాణి’ అర్జీదారులు ఇరుక్కుని నరకం చవిచూశారు. కలెక్టరేట్‌లోని లిఫ్ట్ కొంత కాలంగా సరిగా పనిచేయడంలేదు. ఒక్కోసారి లిఫ్ట్ గ్రౌండు ఫ్లోర్ నుంచి పైకి వెళ్లాల్సిందిపోయి లిఫ్ట్ కింది భాగంలో ఉన్న గుంతలో పడిపోవడం, పైకి వెళ్లేటప్పుడు మధ్యలో ఆగిపోవడం, లిఫ్ట్ తలుపులు తెరుచుకోక స్ట్రక్ అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలుసార్లు కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రజావాణికి విచ్చేసిన కొందరు అర్జీదారులు మెట్లు దిగలేక లిఫ్ట్‌ను ఆశ్రయించారు. వీరు లిఫ్ట్‌లోకి వెళ్లి కిందకు వెళ్లేందుకు స్విచ్ ఆన్ చేశారు. అయినా లిఫ్ట్ కదలకుండా స్ట్రక్ అయిపోయింది. అంతేగాక డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో అందులోని ఉన్నవారు ఆందోళనకు గురై కేకలు వేస్తూ, డోర్లు బాదడం మొదలెట్టారు. అక్కడే ఉన్న ప్రజలు, కొందరు పాత్రికేయులు కలెక్టరేట్ సెక్యూరిటీకి తెలిపేందుకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. దాదాపు 10 నిమిషాల పాటు డోర్లు తెరిచేందుకు అందరూ ప్రయత్నించడంతో ఆఖరుకు లిఫ్ట్ గ్రౌండు ఫ్లోర్‌కు వెళ్లి తెరుచుకోవడంతో అందులో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.