వినతులు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్
అనంతపురం అర్బన్ : జిల్లాలోని మండలాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, డ్వామా పీడీ జ్యోతిబసు, మీ కోసం ఇన్‌చార్జి అనుపమ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 285 అర్జీలు ప్రజల నుంచి అందాయి.
ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో కొన్ని..
♦ తమ ఇంటి ముందు పూర్వం నుంచి ఉన్న రస్తాలో రాకపోకలు సాగిస్తున్నామని, అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆ రస్తాకు ముళ్ల కంప అడ్డుగా వేసి ఇబ్బంది పెడుతున్నారని రాప్తాడు మండలం మరూరుకు చెందిన కె.లక్ష్మిదేవి ఆమె భర్త కె.బాబయ్య ఫిర్యాదు చేశారు.దీనిపై ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారని చెప్పారు.
♦ ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన దుకాణ సముదాయంలో గది కోసం రూ.3 వేలు డీడీ చెల్లించానని, నెలలు గడుస్తున్నా తనకు గదిని అప్పగించలేదని నగర పరిధిలో బుడ్డప్పనగర్‌కు చెందిన మద్దిలేటి ఫిర్యాదు చేశాడు.
♦ తాను 90 శాతం వైకల్యంతో బాధపడుతున్నానని లేపాక్షి మండలం చోళసముద్రానికి చెందిన జి.రాధామ్మ చెప్పింది. తనకు ఇంటి స్థలం కేటాయించారని, అయితే పట్టా ఇవ్వలేదని వేడుకుంది.
♦ తన భూమి కొందరు వ్యక్తులు శ్మశానవాటికగా వాడుకుంటూ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని పామిడి మండలం రాందాసుపురానికి చెందిన వీరభద్రయ్య ఫిర్యాదు చేశాడు. పామిడి పొలం సర్వేనంబరు 201లో తమకు మూడు ఎకరాల భూమి ఉందని చెప్పాడు.
♦ ఇరవై ఏళ్లగా సాగు చేస్తున్న భూమికి పట్టా ఇప్పించాలని లేపాక్షి మండలం విబూదిపల్లికి చెందిన గంగాధరప్ప కోరాడు. సర్వే నంబరు 171.6లో 4.91 ఎకరాల భూమిని ఇరవై ఏళ్లగా సాగు చేసుకుంటున్నామని చెప్పాడు.
♦ కాలువ నిర్మాణానికి భూమి తీసుకొని పరిహారం ఇవ్వలేదని కొత్తచెరువు మండలం గుంటిపల్లికి చెందిన ఊరువాకిలి వెంకటరమణప్ప విన్నవించాడు. కె.లోచర్ల గ్రామ పొలం సర్వే నంబరు 490–2లో 2.96 ఎకరాల భూమి తమకు ఉండగా హంద్రీ–నీవా కాలువ కోసం 34 సెంట్ల భూమి తీసుకున్నారని, నెలలు గడుస్తున్నా పరిహారం ఇవ్వలేదని వాపోయాడు.
♦ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని జాతీయ అంధుల సమాఖ్య జిల్లా కోఆర్డినేటర్ సి.రవి ఫిర్యాదు చేశాడు.
♦ అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారని గుంతకల్లుకు చెందిన దామోదర్ నాయుడు ఫిర్యాదు చేశాడు. కొందరు స్వార్థపరులు డోనుముక్కల, కొనకొండ్ల పరిధిలోని ప్రభుత్వానికి చెందిన కొండలు, గుట్టలు, భూముల్లో ఎర్రమట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment