సాక్షి, అమరావతి: చిత్తూరుకు చెందిన రామారావు తన కుమారుడిని విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. వారాంతంలో తన కుమారుడిని చూసి వచ్చేందుకు సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడకు బయలుదేరితే టికెట్ ధర రూ.560 అయ్యింది. అయితే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ బస్టాండ్లలో యూరినల్స్‌కు టాయిలెట్లను వాడకున్నందుకు ప్రతి చోటా రూ.5 చొప్పున రూ.25 చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాల పేరిట ప్రతి టికెట్‌పై అదనంగా సెస్సు పేరిట రూపాయి వసూలు చేయడం గమనార్హం. మళ్లీ యూరినల్స్ చార్జీల కింద అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికుల్ని దోపిడీ చేస్తోంది.
బీవోటీ విధానంలో దోపిడీ
విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి బస్టాండ్లలో యూరినల్స్‌కు యూజర్ చార్జీల కింద ఆర్టీసీ రూ.5 వసూలు చేస్తోంది. గతంలో బస్టాండ్లలో మరుగుదొడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా అప్పగించారు. అప్పట్లో యూరినల్స్‌కు మాత్రం ఎలాంటి చార్జీలు వసూలు చేసేవారు కాదు. అయితే ఇప్పుడు నిర్మించు–నిర్వహించు–అప్పగించు (బీవోటీ) విధానంలో రెస్ట్ రూమ్‌ల నిర్వహణను 20 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ అప్పగించింది. దీనిలో భాగంగా రెండేళ్ల కిందట విజయవాడ ప్రధాన బస్టాండ్‌లో రెస్ట్ రూమ్ పేరిట టాయిలెట్లను నిర్వహిస్తూ యూరినల్స్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. సిటీ టెర్మినల్‌లో రూ.2 వంతున వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు బస్టాండ్లలోనూ అమలుచేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. గుంటూరులో విజయవాడకు నడిపే సర్వీసుల కోసం ప్రత్యేకంగా మరో బస్టాండ్ నిర్మిస్తున్నారు. అక్కడ కూడా బీవోటీ విధానం ద్వారా నిర్మించే మరుగుదొడ్లలో యూరినల్స్‌కు యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు.
ఏటా టికెట్లపై సెస్సు పేరిట రూ.60 కోట్ల వసూళ్లు
ప్రయాణికులకు బస్‌స్టేషన్లలో తగిన వసతులతో పాటు మూత్రశాలలకు సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ తన ప్రయాణికుల నుంచి అభివృద్ధి సెస్సు పేరిట ప్రతి టికెట్‌పై రూపాయి వంతున వసూలు చేస్తోంది. 2013 నుంచి సెస్సు వసూలు చేస్తోంది. దీనివల్ల ఆర్టీసీకి ఏటా రూ.60 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. ప్రయాణికుల నుంచి సౌకర్యాల కోసం వసూలు చేస్తూ మళ్లీ యూరినల్స్‌కు వెళ్లేందుకు రూ.5 చొప్పున వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 కోట్లతో తొమ్మిది జిల్లాల్లో టాయిలెట్ల నిర్మాణం
ఆసక్తిగల కంపెనీల నుంచి తొమ్మిది జిల్లాల్లో నిర్మించే టాయిలెట్లకు రూ.2 కోట్ల వరకూ వెచ్చించనున్నారు. శ్రీకాకుళం బస్టాండ్‌లో రూ.17 లక్షలు, కావలిలో రూ.13 లక్షలు, విజయనగరంలో రూ.16 లక్షలు, విశాఖలో 25 లక్షలు, గుంటూరులో రూ.26 లక్షలు, చిత్తూరులో రూ.23 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో రూ.36 లక్షలు, కర్నూలులో రూ.18 లక్షలు, అనంతపురంలో రూ.26 లక్షలతో రెస్ట్ రూమ్‌లు నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment