హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను బూచిగా చూపి బస్సు ప్రయాణికుల జేబులు గుల్ల చేసేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలో బస్సు చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, చార్జీలను 15 శాతం పెంచాలన్న ఆర్టీసీ యాజమాన్య ప్రతిపాదనలపై మాత్రం మంత్రివర్గం తర్జనభర్జన పడింది.
పల్లె వెలుగు, సిటీ బస్సులను మినహా మిగిలిన బస్సులపై చార్జీల భారం వేయాలని అనుకున్నా.. నిర్ణయాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు సోమవారం కేబినెట్ మీటింగ్‌లోనే ప్రభుత్వానికి అందించారు. ఈ ప్రతిపాదనలకు యధాతథంగా ఆమోదం తెలిపితే ప్రయాణికులపై రూ.600 కోట్ల మేరకు భారం పడే అవకాశముంది.