ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం నాలుగోసారి ఆర్టీసీ చార్జీలు పెంచేసింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర జనాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పల్లెవెలుగుకు కిలోమీటరుకు 4 పైసలు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు 7 పైసలు, డీలక్స్ 9 పైసలు, సూపర్‌లగ్జరీ 11 పైసలు, ఇంద్ర 12 పైసలు, గరుడ 15 పైసలు చొప్పున పెంచేశారు. పెరిగే చార్జీల ప్రకారం జిల్లాలో కిలోమీటరుకు పల్లెవెలుగు 59 పైసలు, ఎక్స్‌ప్రెస్ 79 పైసలు, డీలక్స్ 89 పైసలు, సూపర్ లగ్జరీ 105 పైసలు, ఇంద్ర 132 పైసలు, గరుడ సర్వీసుకు 165 పైసలు చొప్పున ఆర్టీసీ వసూలు చేస్తుంది. పెరిగిన చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. సరాసరిన ఏడాదికి రూ.30 కోట్ల అదనపు ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
చార్జీల పెంపు భారం ఇలా: ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన తరువాత
తన తొలి అయిదేళ్ల పాలనలో కేవలం ఒకే ఒకసారి 2006లో బస్సు చార్జీలను పెంచారు. అది కూడా పల్లెవెలుగులపై భారం పడకుండా. సంస్థాగతంగా కూడా బలోపేతమై 2008-09లో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ ఎన్నడూలేనంతగా రూ.94 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. కానీ 2009 సెప్టెంబర్ 2న వైఎస్‌ఆర్ ఆకస్మిక మరణంతో ఆర్టీసీకి కూడా కష్టకాలం దాపురించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోలుకోలేని నష్టాలను మూటగట్టుకుంటూనే ఉంది. ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు వైఎస్‌ఆర్ 5 శాతం సేల్స్ టాక్స్‌ను తగ్గించడం కూడా సంస్థకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. కానీ తరువాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రోశయ్య 2010 జనవరిలో ఆర్టీసీ చార్జీలను పెంచగా, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం 2011 జూలై 16న, 2012 సెప్టెంబర్ 24న, తాజాగా మరోసారి ఆర్టీసీ చార్జీలను పెంచేశారు.
దీంతో గతంలో మూడు రూపాయల కనీస చార్జీగా ఉన్న పల్లెవెలుగు టికెట్ నేడు ఏకంగా రూ. 6లకు చేరుకుంది. తెలంగాణ , సమైక్యాంధ్ర ఉద్యమాలను ప్రస్తుతం చార్జీల పెంపుదలకు కారణంగా చూపిస్తున్నారు. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్న డీజిల్ ధరలు, టోల్ గేటు చార్జీ కూడా పెనుభారంగానే మారింది. ఇవే కాకుండా విద్యార్థుల బస్సుపాసు చార్జీలను కూడా ఆర్టీసీ పెంచేసింది. ఆర్టీసీ బస్టాండులో ప్రయాణీకులకు మౌలిక వసతుల పేరిట ఏకంగా టికెట్‌కు రూపాయి చొప్పున ఈ ఏడాది జూలై నుంచి ఆర్టీసీ అన్ని వర్గాల జనంపైన వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీ సర్వీసులు మొత్తం 745 ఉన్నాయి. ఇవి కాకుండా 108 అద్దె బస్సులున్నాయి.
వీటిలో 131 ఎక్స్‌ప్రెస్, 85 డీలక్స్, 116 హైటెక్ సర్వీసులు, 15 ఇంద్ర సర్వీసులు, గరుడ సర్వీసులున్నాయి. పల్లెవెలుగు సర్వీసులు 506 ఉన్నాయి. రోజుకు సరాసరిన ఆదాయం రూ. 65 లక్షలు వస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరల కారణంగా రోజుకు మరో 8 లక్షల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. దీంతో ఇకనుంచి రోజుకు రూ.73 లక్షల ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రకారం జిల్లాకు రూ.29.20 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు సంబంధించి ఒంగోలు నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్‌కు రూ. 38, బెంగళూరుకు రూ. 58, తిరుపతికి రూ. 29, విశాఖకు రూ. 57 చార్జీలు అదనంగా పెరిగాయి.
మళ్లీ ఆర్టీసీ బాదుడు
Published Tue, Nov 5 2013 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement