
ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా రీజియన్ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట డిపోను కూడా తనిఖీ చేయనున్నారు. డిపోలు, గ్యారేజ్‌లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, డిపోల భవనాలు, గ్యారేజ్‌ల స్థితిగతులను స్వయంగా పరిశీలించనున్నారు. తమ సమస్యలను ఎండీ పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
చిత్తూరు, తిరుపతి సిటీ : జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 డిపోల్లో డీఎం నుంచి కిందిస్థాయి కార్మికుల వరకు 7,200 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను ఎంప్లాయీస్ యూనియన్, ఎన్‌ఎంయూ నాయకులు ఎండీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే బస్సు పోర్టు నిర్మాణానికి 15 ఎకరాల స్థల సేకరణ, టీటీడీ స్థలాలు, భవనాలకు ఆర్టీసీ నెలవారీగా అద్దెల రూపంలో సుమారు రూ.45 లక్షల దాకా చెల్లిస్తున్నారు. అద్దెలను తగ్గించి నామినల్ చార్జీలు చెల్లించేలా ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో ఎండీ చర్చించనున్నారు. తిరుపతి– తిరుమల మధ్య ఎలక్ట్రానిక్ బస్సులు నడపడం, ఆర్టీసీ కార్మికుల వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రి స్థాయి పెంపు వంటి అంశాలపై నెల్లూరు జోన్ ఈడీ, ఆర్‌ఎం, ఇతర అధికారులతో ఎండీ సుదీర్ఘంగా సమీక్షించనున్నారు.
నేడు డీఎంలతో ఎండీ సమావేశం..
ఎండీ సురేంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్‌ఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిపో మేనేజర్లు, సీఐలు, మెకానికల్ ఫోర్‌మెన్లతో సమావేశం కానున్నారు. సమావేశంలో డిపోల వారీగా స్థితిగతులను డీఎంలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వివరాలను వీక్షించనున్నారు. అనంతరం ఎండీతో ఎంప్లాయిస్, ఎన్‌ఎంయూ నాయకులు సమావేశమై జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నారు. మధ్యాహ్నం తిరుపతి బస్‌స్టేషన్, అలిపిరి, మంగళం డిపోలను తనిఖీలు చేయనున్నారు.
♦ 2వ రోజు మంగళవారం శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట బస్ డిపోలను తనిఖీ చేయడంతో పాటు బస్‌స్టేషన్లలోని మౌలిక సదుపాయాలను పరిశీలించనున్నారు.
♦ 3వ రోజు బుధవారం పీలేరు, పలమనేరు, కుప్పం, మదనపల్లి, చిత్తూరు–1, చిత్తూరు–2 డిపోలను సందర్శించనున్నారు.
ప్రధాన సమస్యలివే...
♦ రాయలసీమలోని ఆర్టీసీ కార్మికుల సౌకర్యార్థం తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలి.
♦ యాక్సిడెంట్లు, అత్యవసర పరిస్థితులలో పక్కరాష్ట్రాలలో చికిత్స పొందుతున్న వారికి మెడికల్ క్లయిమ్‌లు మంజూరు చేయాలి.
♦ గత రెండేళ్లుగా విజయవాడ హెడ్ ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉన్న జిల్లాకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–1 సమస్యను వెంటనే పరిష్కరించాలి.
♦ తిరుపతి– తిరుమల మధ్య బస్సులు నడిపే ఘాట్‌రోడ్డు డ్రైవర్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలి.
♦ స్పెషల్ సర్వీసు డ్యూటీలు చేసిన వారికి రావాల్సిన ఆలవెన్సులు ఇప్పించాలి.
♦ తిరుపతి సెంట్రల్ బస్‌స్టేషన్‌లో దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న నీటిసమస్యను బోర్లు వేసి పరిష్కరించాలి.
♦ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో, గ్యారేజ్‌ల్లో సీసీ ఫ్లోరింగ్ నిర్మాణాలు చేపట్టాలి.
♦ టార్గెట్లు లేకుండా తమిళనాడు తరహాలో ఇన్సెంటివ్‌ల విధాణం ప్రవేశపెట్టాలి.
♦ గ్యారేజ్‌లలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
♦ డిస్పెన్సరీలలో మందుల కొరత తీర్చాలి.
Comments
Please login to add a commentAdd a comment