కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొలువుల కోలాహలం శుక్రవారం ముగిసింది. తెలంగాణ పదిజిల్లాలకు కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీకి 27వేల మంది అభ్యర్థులు తరలివచ్చారు. వీరికి వేయి మంది సిబ్బంది సహకరించారు. ర్యాలీ నిర్వహించిన ప్రకాశం స్టేడియం, స్థానిక జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాలు వారంరోజులపాటు అభ్యర్థులతో కళకళలాడాయి. గురువారం పరుగు పరీక్షలను పూర్తి చేసి..దానిలో అర్హత సాధించిన అభ్యర్థులు 200మందికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. సోల్జర్ ట్రేడ్స్‌మన్ విభాగం పరుగు పందెంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వీపర్స్, స్కావెంజర్స్, వెయిటర్స్, బార్బర్స్ తదితర విభాగాలకు కేటాయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.
సిబ్బంది సహకారం..
తెలంగాణలోని పది జిల్లాలకు ఏర్పాటు చేసిన ఆర్మీ ర్యాలీలో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు చెందిన 900 మంది సిబ్బందికి అధికారులు విధులు కేటాయించారు. పోలీస్‌శాఖ నుంచి 600 మంది, రెవెన్యూ నుంచి 100 మంది, మున్సిపల్, సింగరేణి శానిటేషన్ విభాగాల నుంచి 200 మంది సిబ్బంది ఆర్మీ ర్యాలీలో విధులు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభ్యర్థుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సాధారణ ధరలకే సేవలందించారు. భోజనం, అల్పాహారం, జిరాక్స్, ఫొటో ప్రింటింగ్ తదితర సేవల కోసం ప్రత్యేక స్టాల్స్ వెలిశాయి. బస్టాండ్ సెంటర్ నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ప్రత్యేకంగా భోజన కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎనిమిది రోజులపాటు సుమారు రూ.10 లక్షల మేరకు భోజన వ్యాపారం సాగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
‘గూడెం’ వాసుల ఔదార్యం..
అభ్యర్థులకు వివిధ సేవా సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు ఉచిత భోజన సౌకర్యం కల్పించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్మీ ఏర్పాట్లను సింగరేణి సంస్థ నిర్వహించగా, పోలీస్‌శాఖ నుంచి విధులకు హాజరైన పోలీసులకు నవభారత్ సంస్థ భోజన వసతి కల్పించింది. పట్టణ మెడికల్ అసోసియేషన్ వారు అభ్యర్థులకు గ్లూకోజ్ అందించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభ్యర్థులకు ప్రతిరోజు మజ్జిగ అందించారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రెండు రోజులపాటు హాజరైన అభ్యర్థులకు ఉచిత భోజనం అందించారు. రక్ష స్వచ్ఛంద సంస్థతోపాటు మరికొంత మంది స్వచ్ఛందంగా అభ్యర్థులకు భోజన వసతి కల్పించారు.
ముగిసిన ఉద్యోగపర్వం
Published Sat, Jan 25 2014 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement