
రణరంగంగా ఆర్ట్స్ కళాశాల
- ప్రిన్సిపాల్ తీరుకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
- ఆరు గంటలసేపు గందరగోళం
- ప్రిన్సిపాల్ చాంబర్ ముట్టడి
యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల శనివారం రణరంగంగా మా రింది. హాజరుతో పనిలేకుండా అందరినీ పరీక్షకు అనుమతించాలంటూ రెండువేల మంది విద్యార్థులు మూకుమ్మడిగా ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో మరింత రెచ్చిపోయారు. ఈలలు, కేకలతో కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. కొందరు విద్యార్థులు రాళ్లు, ఇసుక రువ్వడంతో ఓ పోలీసు అధికారి గాయపడ్డాడు. ఆపై ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి చక్కబడింది.
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు మార్చి 10వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువు ఈనెల 20వ తేదీతో ముగస్తుంది. హాజరు శాతం 75 కంటే తక్కువ ఉన్నవారి జాబితాను శనివారం నోటీసు బోర్డులో పెట్టారు. 50 నుంచి 75 శాతం మధ్య హాజరు ఉన్నవారు అపరాధ రుసుం చెల్లించాలని సూచించారు. 75 శాతం కన్నా ఎక్కువ హాజరువున్నవారు 117 మంది మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు.
మొత్తంగా 86 శాతం మందికి తగినంత హాజరులేనట్టు నోటీసు బోర్డులో పేర్కొన్నారు. దీన్నిచూసి విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. హాజరుతో పనిలేకుండా పరీక్షకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఇతర కారణాల వల్ల తరగతులకు సరిగా హాజరుకాలేదని, అందువల్ల హాజరుతో సంబంధంలేకుండా అందర్నీ పరీక్షలకు అనుమతించాలని కోరారు. అలాగే గేమ్స్, ఎన్‌సీసీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సంబంధిత హాజరు కలపాలని విజ్ఞప్తి చేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న మిగతా కళాశాలల్లో ఇదే విధానాన్ని పాటిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌కు విన్నవించారు. ఆర్ట్స్ కళాశాలలోనూ అదే పద్ధతిని అమలు చేయాలని సూచించారు. అందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. విద్యార్థులందరినీ పరీక్షకు అనుమతించాలని కోరుతూ ప్రిన్సిపాల్‌ను ఘెరావ్ చేశారు. నోటీసు బోర్డును పగలగొట్టారు. ఈ నేపథ్యంలో క్రైమ్ డీఎస్పీ ఎంవీఎస్ స్వామి, క్యాంపస్ సీఐ రామకృష్ణారెడ్డి, క్రైమ్ సీఐ నాగసుబ్బన్న, ఎస్‌ఐ తిమ్మారెడ్డిల ఆధ్వర్యంలో పోలీసుల బృందం రంగప్రవేశం చేసింది.
విద్యార్థుల గుంపును చెదరగొట్టడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో విద్యార్థులకు నచ్చజెప్పాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో విద్యార్థులు కొందరు గాల్లోకి ఇసుక చల్లారు. చిన్నచిన్న రాళ్లను విసిరారు. దీంతో క్యాంపస్ పోలీసు స్టేషన్ రైటర్ దేవదత్తరెడ్డి తలకు గాయమైంది. ఆగ్రహించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కొందరు విద్యార్థి నాయకులను ఈడ్చుకెళ్లారు. పాతకేసుల్లో నిందితుడుగా ఉన్న టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.ఆనంద్‌గౌడ్‌ను ఈడ్చుకుంటూ క్యాంపస్ స్టేషన్‌కు తరలించారు. అయినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. ఆరుగంటల వరకు ఆందోళన సాగింది. చివరకు పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు.
నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను
తాను హాజరు విషయంలో నిబంధనల ప్రకారమే నడచుకున్నానని ప్రిన్సిపాల్ క్రిష్టఫర్ తెలిపారు. 75 నుంచి 50 శాతం హాజరు ఉన్న వారిని అపరాధ రుసుము కట్టమని చెప్పానన్నారు. 50 శాతం హాజరు కూడా లేనివారిని పరీక్షకు ఎలా అనుమతించాలని ప్రశ్నించారు.