ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం) వల్ల ప్లేస్‌మెంట్ శాతం తగ్గుతోంది.
ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.
ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర‍్వ విద్యార్ధులు..
దీంతో ఐఐటీ ఢిల్లీ పూర‍్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్ధులకు సహకరించాలని
ఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది.
నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులు
మరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.
చాట్‌జీపీటీ ఎఫెక్ట్
బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్‌మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్‌మెంట్‌లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్‌పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ‍్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్ తగ్గిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment