ఆ కంపెనీలకు అనుమతినివ్వం
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆదిత్య హౌసింగ్, ఎన్వీయన్ ఇంజనీర్స్ కంపెనీలకు అనుమతినివ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులు చేపట్టే అర్హత, సామర్థ్యం ఈ రెండు కంపెనీలకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియను నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తాము దాఖలు చేసిన అప్పీల్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరింది.
ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.