
గవర్నర్ హుకుంపై బతకాలా?: అసదుద్దీన్ ఒవైసీ
ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండగా కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించటం ఏమిటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?
ప్రభుత్వం ఏర్పాటు చేసే దమ్ము లేదా?
కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ధ్వజం
నిజావూబాద్, న్యూస్‌లైన్: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండగా కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించటం ఏమిటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. నిజామాబాద్‌లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ములేదా.. గవర్నర్ ఆదేశాల మేరకు బతకాలా..ప్రజాస్వామ్య దేశంలో ఆయన హుకుం ఏందీ.. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ముస్లింలను ఊచకోత కోశారని, ఆ విషయం మరిచిపోయి ప్రస్తుతం అభివృద్ధిని చూడండి.. అంటూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ సాధించిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవాచేశారు.
తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన సందర్భంగా తాము పలు డిమాండ్లను తెరపైకి తెచ్చినప్పటికీ యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎంఐఎం నుంచి 10 మం ది ఎంపీలు ఉంటే దేశ భవిష్యత్తునే మార్చేస్తానని అసదుద్దీన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ముస్లింలను కాంగ్రెస్ పార్టీ పొట్టనపెట్టుకుందని ఆరోపించా రు. ములాయం తనకు తాను రక్షకుడనని చెప్పుకుంటున్నాడని, అయితే యూపీలో ఎందరో ముస్లింలు మృతి చెందారని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా మజ్లిస్ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలకు మీరు సత్తా చూపించండి, అసెంబ్లీలో బీజేపీకి మా సత్తా చూపిస్తామన్నారు.