
ఆరిన ఆశా దీపం
పచ్చని పందిరి.. బంధువుల సందడి.. ఇంకా తగ్గనే లేదు. మరుపెళ్లి చూసుకుని వెళ్దామనుకున్నారు కొందరు. ఈలోగా బట్టలు ఉతికేందుక ని పెన్నానదికి బయలుదేరారు. వారి వెంటే ‘నేనూ వస్తానంటూ...’ మూడేళ్ల చిన్నారి మారాం చేసింది. పెద్దలు కాదనలేకపోయారు. ఆ చిన్నారి నది ఒడ్డున ఆడుకుంటుండగా.. పెద్దలు బట్టలుతకడంలో నిమగ్నమయ్యారు. ఆ తరువాత చూసుకునే సరికి ఆ బిడ్డ కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు పెన్నానదిలో కొట్టుకుపోయిన చిన్నారి మృతదేహం కన్పించడంతో తల్లి ఆర్తనాదాలు.. బంధువుల ఆక్రందనలతో పెన్నా తీరం మూగబోయింది.
సిద్దవటం
సిద్దవటం సమీపంలోని పెన్నానదిలో పడి చేతిపట్టు చాముండేశ్వరి అనే మూడేళ్ల చిన్నారి ఆదివారం మధ్యాహ్నం మరణించింది. చిట్వేలి మండలం శేష అగ్రహారం గ్రామానికి చెందిన నాగమణి, చెంగల్రాయుడు దంపతుల కుమార్తె అయని చాముండేశ్వరి అకాల మరణం అందరినీ కలచివేసింది.
పెళ్లి కోసం వచ్చి..
తమ అక్క కుమార్తె లక్ష్మీదేవి వివాహం శుక్రవారం జరగ్గా, నాగమణి కుటుంబం హాజరైంది. మరుపెళ్లి చూసుకుని వెళ్దువులే.. అంటూ అక్క, బావ, బంధువులు చెప్పడంతో కాదనలేకపోయింది. శనివారం మరుపెళ్లి జరగ్గా.. ఆదివారం ఉండి, సోమవారం బయలుదేరాలనుకుంది. ఆదివారం మధ్యాహ్నం నాగమణి, అక్క మరికొందరు బంధువులు కలసి బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని పెన్నానదికి బయలుదేరారు. వారి వెంటే చాముండేశ్వరి కూడా వెళ్లింది.
పెద్దలు బట్టలుతుకుతుండగా, గట్టుపై ఆడుకుంటున్న చాముండేశ్వరిని వారు గమనించలేదు. బట్టలు ఆరేసేందుకు గట్టుపైకి వచ్చిన వారికి చిన్నారి కన్పించలేదు. ఆందోళనకు గురయ్యారు. పరిసరాల్లో వెతికారు. ఫలితం లేకపోయింది. పెన్నానది నీటిలో మునిగి కొటుట్టుకుపోయిన విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. ఆకుల వీధి సమీపంలోని పెన్నానదిలో కొట్టుకుపోతున్న చిన్నారిని స్థానికుడు ఒకరు గమనించి బయటకు తీశారు. అప్పటికే ఆ పాప ప్రాణంతో లేకుండాపోయింది. విషయం తెలుసుకున్న చాముండేశ్వరి తల్లి, పెద్దమ్మ, ఇతర బంధువులు గుండెలు పగిలే లా రోదించారు. ‘ఎంత పని చేశావు బిడ్డా.. ఇక మీ నాన్నకు ఏమని సమాధానం చెప్పాలంటూ’ నాగమణి తన బిడ్డ మృతదేహంపై పడి రోదించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది.