ఇలాంటి ‘అవిశ్వాసం’ చరిత్రలో తొలిసారి: అశోక్‌బాబు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు చెప్పారు. ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అదే పార్టీపై అవిశ్వాసం పెడతామనడం దేశచరిత్రలోనే మొదటిసారని, దీన్నిబట్టి సీమాంధ్రలో ఉద్యమం ఎంత బలంగా ఉందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలకు సాంఘిక బహిష్కరణ చేయడంతోపాటు వారికి రాజకీయ భవిష్యత్తులేకుండా చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్ రాకను చెడు సంకేతంగా భావిస్తూ ‘డిగ్గీరాజా గో బ్యాక్’ అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరేందుకు రెండు మూడు రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు వెల్లడించారు. ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, 5న ఎన్నికలు జరుగుతాయని అశోక్‌బాబు తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సంఘం నగర అధ్యక్షులు పీవీవీ సత్యనారాయణ, ఆంధ్రామేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విభజనను వ్యతిరేకించాలని మజ్లిస్‌కు వినతి
శాసనసభ సమావేశాల్లో ‘రాష్ట్ర విభజన’ను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని ఏపీఎన్‌జీవో సంఘం మజ్లిస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. అశోక్‌బాబు ఆధ్వర్యంలోని బృందం మంగళవారం దారుస్సలాంకు వెళ్లింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ అందుబాటులో లేకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఇతర శాసన సభ్యులతో సమావేశమైంది. శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని మజ్లిస్ పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేశామని అనంతరం అశోక్‌బాబు మీడియాతో చెప్పారు.