'సామ, దాన, దండోపాయాలు ఉపయోగించండి'
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తుది అంకానికి చేరిన తరుణంలో సీమాంధ్ర మంత్రులకు సమైక్య సెగ తప్పడం లేదు. జీవోఎం నివేదిక అనంతరం టి.బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సీమాంధ్ర వాదులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులే కారణమంటూ నిరనస గళం వినిపిస్తున్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు.. పార్లమెంట్ లో సీమాంధ్ర మంత్రులు టి.బిల్లును అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఆ బాధ్యతను సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులే తీసుకుని బిల్లు ఆమోదించబడకుండా చూడాలని అశోక్ బాబు తెలిపారు. కాకుంటే కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చేపడతామన్నారు. పదవులకోసం చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలని విజ్క్షప్తి చేశారు. సామ, దాన, దండోపాయాలు ఉపయోగించి బిల్లును అడ్డుకోవాలన్నారు.కాని పక్షంలో అదే పని చేయడానికి తాము వెనుకాడబోమని అశోక్ బాబు స్పష్టం చేశారు.