రమేష్(ఫైల్)
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన రమేష్ 2009 బ్యాచ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఐదేళ్లుగా ఏఎస్పీ కారు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఎస్పీ శరత్‌బాబు వద్ద ఏడాదిన్నర నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఎస్పీ రామకృష్ణ ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు రావాలని ఏఎస్పీ శరత్‌బాబును పిలిపించారు. దీంతో ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గన్‌మన్ కె.నాగేంద్ర కారు దిగి ఏకే 47ను చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గన్ మిస్‌ఫైర్ అయి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రమేష్ ఛాతిలోకి ఓ బుల్లెట్, రెండో బుల్లెట్ రమేష్ చేతికి తగిలి పక్కకు వెళ్లింది. దీంతో రమేష్‌ను నెల్లూరు కిమ్స్ (బొల్లినేని హాస్పిటల్)కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10.45 గంటలకు మృతిచెందారు.
ఇదిలా ఉండగా రమేష్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం హాస్పిటల్ నుంచి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై విచారణ జరిపిస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం రమేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన సొంత ఊరు సీతారామపురానికి పోలీసులు తీసుకెళ్లారు. సోమవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.