రెండో రోజూ వాయిదాలే
ఉభయ సభల్లో అదే తీరు
సమైక్య, తెలంగాణ నినాదాల హోరు
పేపర్లు చించి గాల్లోకి వెదజల్లిన సభ్యులు
ఎజెండాకు నోచుకోకుండానే వాయిదాలు
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభల్లో రెండో రోజు శనివారం కూడా వాయిదాల పర్వమే సాగింది. ఎమ్మెల్యేలంతా పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రాంతాలవారీగా విడిపోయి జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు చేశారు. ఎలాంటి ఎజెండా కార్యక్రమాలేవీ చేపట్టకుండానే శాసనమండలి, శాసనసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ అయితే పట్టుమని పది నిమిషాలు కూడా జరగలేదు. ఉదయం తొమ్మిదికి సభ మొదలైంది. వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించడంతోనే నిరసనలు మొదలయ్యాయి.
సమైక్య తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చకు అనుమతించాలంటూ సీమాంధ్ర టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురయ్యాయి.వెంటనే వైఎస్సార్‌సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ పోడియంలోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఇది సరికాదని, సభలో ప్లకార్డులు ప్రదర్శించరాదని, అందరికీ మాట్లాడేందుకు అవకాశముంటుందని, సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరినా ఫలితం లేకపోయింది. దాంతో వెంటనే సభను వాయిదా వేశారు. 10.37కు సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు మళ్లీ సమైక్యాంధ్ర ప్లకార్డులతో పోడియంలోకి వెళ్లారు. టీఆర్‌ఎస్ సభ్యులు కూడా జై తెలంగాణ అంటూ పోడియంలోకి దూసుకెళ్లడంతో పోటాపోటీ నినాదాలతో సభ హోరెత్తింది. కొందరు సభ్యులు కాగితాలు చించి గాల్లోకి ఎగరేశారు. దాంతో నిమిషం లోపే సభ మళ్లీ వాయిదా పడింది. 12.43కు సభ తిరిగి ప్రారంభమైనా అదే పరిస్థితి నెలకొంది. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయలక్ష్మి తమ పార్టీ సభ్యులతో కలసి డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు లేఖ అందజేశారు. అనంతరం అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.
శాసనమండలిలోనూ..
ఉదయం మండలి ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీతో పాటు సీమాంధ్ర టీడీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేశారు. సమైక్య తీర్మానం పెట్టాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ సభ్యులు కూడా పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు ప్రారంభించారు. చర్చను అడ్డుకుంటున్న వారిని సభ నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఇరుపక్షాలకు చైర్మన్ చక్రపాణి ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలినాయకుడు సి.రాంచంద్రయ్య, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పాల్గొని మండలి జరుగుతున్న తీరుపై చర్చించారు.
అధికార పక్షం చర్చకు సిద్ధంగా ఉందని శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ అన్నారు. అందుకు సభ్యులు సహకరించాలన్నారు. చర్చకు తామూ సిద్ధమేనని ఇతర పార్టీల సభ్యులన్నారు. ‘‘దానిపై ప్రభుత్వం వైఖరి చెప్పండి. క్లాజ్‌లవారీగా చర్చిస్తారా? బిల్లుపై చర్చ పెడతారా? మాట్లాడే అవకాశం ఎవరికి ఎలా ఇస్తారు? సవరణలు ప్రతిపాదిస్తే ఓటింగ్ పెడతారా? వీటన్నింటినీ ప్రభుత్వం స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. దానిపై సీఎం, స్పీకర్, చైర్మన్‌లతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని శైలజానాథ్ చెప్పారు. తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, అన్ని పక్షాలకు అవకాశమిచ్చేలా చర్యలు తీసుకుంటానని చైర్మన్ హామీ ఇచ్చారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.
ప్లకార్డుతో శైలజానాథ్
శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ శనివారం సభలో ప్లకార్డు పట్టుకుని స్పీకర్‌కేసి ప్రదర్శించడం వివాదాస్పదమైంది. శ్రీధర్‌బాబు నుంచి ఆ శాఖను శైలజానాథ్‌కు సీఎం కిరణ్ అప్పగించడం తెలిసిందే. శనివారం సభలో ఆయన సమైక్యాంధ్ర అనుకూల నినాదాలున్న ప్లకార్డు పట్టుకుని ఉండటాన్ని కొందరు బీజేపీ, టీఆర్‌ఎస్ సభ్యులు గుర్తించి నిరసన తెలిపారు. సభ ప్రారంభమవగానే ముందువైపు కాకుండా కొన్ని వరసలు దాటుకుని వెనక వైపు వచ్చిన శైలజానాథ్ సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని స్పీకర్ వైపు ప్రదర్శించటమే గాక కొన్నింటిని సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులకు అందించారని తెలంగాణ నేతలు పేర్కొన్నారు. ఆ సమయంలో శైలజానాథ్ ఉన్న ప్రాంతం గ్యాలరీలోని విలేకరులకు కనిపించలేదు. సభ వాయిదా పడగానే బీజేపీ, టీఆర్‌ఎస్ సభ్యులు మంత్రి తీరును తప్పుబట్టారు. సభా వ్యవహారాల మంత్రిగా ఒక ప్రాంతానికి అనుకూలంగా సభలో వ్యవహరించటం సరికాదని విమర్శించారు.
పోడియంకు రక్షణగా మార్షల్స్
శుక్రవారం మొదలైన మలి విడత శీతాకాల సమావేశాల్లో తొలి రోజే సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి నినాదాలు చేయటం, ఎలాంటి చర్చా జరగకుండానే సభ వాయిదాపడటంతో శనివారం అసెంబ్లీలో మార్షల్స్ హడావుడి కనిపించింది. ఉదయం సభ తొలిసారి వాయిదాపడి తిరిగి ప్రారంభ మయ్యే సమయంలో తెలుపు దుస్తుల్లోని 13 మంది మార్షల్స్ పోడియం ముందు ఆ చివరి నుంచి ఈ చివర దాకా రక్షణగా నిలబడ్డారు. అప్పటికి స్పీకర్ ఇంకా సభలోకి రాలేదు. ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం వద్దకు వెళ్లి మార్షల్స్ అలా నిలబడటం సరికాదన్నారు. తర్వాత సభ ప్రారంభమవుతూనే వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యులు పోడియం వైపు వెళ్లగా వారిని మరింత ముందుకు వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుగా నిలబడ్డారు. సభ వాయిదా పడి మళ్లీ సమావేశమైనప్పుడు కూడా మార్షల్స్ అలాగే అడ్డుగా నిలబడటం విశేషం.