కరీంనగర్: అసెంబ్లీని ప్రొరోగ్ చేసినప్పటికీ డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగి తీరుతాయని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం జరిగిన రచ్చబండలో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను ఆపాలని కొందరు కలలు కంటున్నారని, అవి కలలుగానే మిగిలిపోతాయని పరోక్షంగా సీఎం కిరణ్‌ని ఉద్దేశించి దెప్పి పొడిచారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లుపై చర్చిస్తామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిన అవసరం లేదని, చేసినప్పటికీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో ఇబ్బందులు ఉండవని అన్నారు.
తప్పనిసరిగా శాసనసభ సమావేశాలపై బీఏసీ సమావేశం నిర్వహించి అజెండాను రూపొందిస్తామని, వీటిని నిర్వహించడం తమ బాధ్యత అని చెప్పారు. అసెంబ్లీ ప్రొరోగ్ విషయమై తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కలుస్తున్నారన్నారు. త్వరలోనే రచ్చబండకు కొత్త పేరు పెడతామని చెప్పారు.