assembly prorogue
-
డిసెంబర్లోనే అసెంబ్లీ సమావేశాలు: శ్రీధర్‌బాబు
కరీంనగర్: అసెంబ్లీని ప్రొరోగ్ చేసినప్పటికీ డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరిగి తీరుతాయని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం జరిగిన రచ్చబండలో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను ఆపాలని కొందరు కలలు కంటున్నారని, అవి కలలుగానే మిగిలిపోతాయని పరోక్షంగా సీఎం కిరణ్‌ని ఉద్దేశించి దెప్పి పొడిచారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లుపై చర్చిస్తామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిన అవసరం లేదని, చేసినప్పటికీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో ఇబ్బందులు ఉండవని అన్నారు. తప్పనిసరిగా శాసనసభ సమావేశాలపై బీఏసీ సమావేశం నిర్వహించి అజెండాను రూపొందిస్తామని, వీటిని నిర్వహించడం తమ బాధ్యత అని చెప్పారు. అసెంబ్లీ ప్రొరోగ్ విషయమై తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కలుస్తున్నారన్నారు. త్వరలోనే రచ్చబండకు కొత్త పేరు పెడతామని చెప్పారు. -
అసెంబ్లీ ప్రోరోగ్‌పై గవర్నర్‌ను కలిసిన టి.మంత్రులు
హైదరాబాద్: అసెంబ్లీ ప్రోరోగ్ అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను సోమవారం తెలంగాణ మంత్రులు కలిశారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయొద్దంటూ వారు గవర్నర్‌కు విన్నవించారు. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలంటూ సీఎంఓ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీఅసెంబ్లీ ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సుల జారీకి వీలుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది. ప్రోరోగ్ అనేది పాలనాపరమైన అంశమని, అంతేతప్ప ఇందులో రాజకీయాలు, దురుద్దేశాలు ఏమీ లేవని వివరించింది. కాగా తెలంగాణ మంత్రులు మాత్రం అసెంబ్లీ ప్రోరోగ్ వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే టీ.మంత్రులు గవర్నర్ ను కలిశారు. -
విడిపోయినా ప్రజలు కలిసుండాలి: పళ్లంరాజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలు కలిసుండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు. ఆ దిశగా కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘నవోదయ పాఠశాలల జాతీయ సమగ్రతా సమావేశం’లో శుక్రవారం పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్రప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని, ఈ వేగం తమకూ ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో కేంద్రం ముందు ఎలాంటి వాదనలు వినిపించలేదన్న భావన రాకూడదన్న ఉద్దేశంతోనే మంత్రుల బృందానికి(జీవోఎం) 11 అంశాలపై నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. తాము సమైక్యంగా ఉండాలని లిఖితపూర్వకంగా రాసిచ్చామని, అయితే విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన అంశాలపై నివేదించామని, ఇంతకుమించి వివరాలు చెప్పలేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్కు సంబంధించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్య నడుస్తున్న వివాదంపై తాను వ్యాఖ్యానించబోనని చెప్పారు. విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు చేతులెత్తేయలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరామని, విభజన వద్దని స్పష్టం చేశామని అన్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందా? లేదా? అన్నది తాను చెప్పలేనన్నారు. నవోదయ పాఠశాలలు పనితీరు అద్భుతం.. దేశంలో నవోదయ విద్యాసంస్థల పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. ‘నవోదయ పాఠశాలల జాతీయ సమగ్రతా సమావేశం’లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడానికి 1986లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. తొమ్మిది, పదో తరగతి చదివే సమయంలో ఒక ప్రాంతంవారు మరో ప్రాంతంలో ఏడాదిపాటు విద్యనభ్యసించడం వల్ల ఆ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు అర్థం చేసుకోవడానికి వీలుంటుందన్నారు. 2022 నాటికి ఐదు కోట్ల మంది యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం తేవడం వల్ల ప్రస్తుతం 23 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారని, వీరిలో 12 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్నభోజన కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీయూ వైస్‌చాన్సలర్ రామకృష్ణ రామస్వామి, నవోదయ విద్యాలయాల కమిషనర్ జీఎస్ భత్యాల్లు కూడా ప్రసంగించారు. -
ఆర్డినెన్సుల జారీ కోసమే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభను నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేయాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ రాయటం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆర్డినెన్సులు తీసుకువచ్చేందుకు వీలుగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈమేరకు సీఎంఓ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘అసెంబ్లీ, కౌన్సిల్ ప్రొరోగ్ విషయమై స్పీకర్ కార్యాలయానికి సీఎంఓ లేఖ రాసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం రాసిన లేఖ మాత్రమే. అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా ఉన్న సమయంలో ఆర్డినెన్సులు తీసుకురావటానికి సాంకేతికంగా వీలుండదు. కొన్ని ఆర్డినెన్సులు తీసుకురావలసిన అవసరమున్నందున ప్రొరోగ్ చేయాలని లేఖ పంపాం. ఇది పరిపాలనా సౌలభ్యం కోసమే’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 21వ తేదీతో ముగిశాయి. దాదాపు ఐదు మాసాలుగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ స్పీకర్‌కు లేఖ రాయని సీఎం కిరణ్.. 15 రోజుల కిందటే ఈ లేఖ రాశారు. మలివిడత సమావేశాలకు వ్యవధి నెల రోజుల్లోపే ఉన్న తరుణంలో, ఈ నెలాఖరుకు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రానున్న సమయంలో ఈ లేఖ సహజంగానే వివాదాన్ని రేపింది. -
ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సులు ఇవ్వచ్చు: సీఎంవో
అసెంబ్లీ ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సుల జారీకి వీలుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రోరోగ్ అనేది పాలనాపరమైన అంశమని, అంతేతప్ప ఇందులో రాజకీయాలు, దురుద్దేశాలు ఏమీ లేవని తెలిపింది. ప్రోరోగ్ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశామని, ఆయన నుంచి సమాధానం ఇంకా రావాల్సి ఉందని సీఎంవో చెప్పింది. కార్యదర్శి ఇచ్చే సూచనను బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సీఎంవో వర్గాలు తెలిపాయి. -
'స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు'
హైదరాబాద్ : అసెంబ్లీని హుందాగా నడిపిన స్పీకర్‌ను ముఖ్యమంత్రి వర్గమే అభిశంసించడం వెధవ బుద్ధికి నిదర్శనమని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ అసెంబ్లీ ప్రొరోగ్కు, తెలంగాణ బిల్లుకు సంబంధం లేదని అన్నారు. స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అటార్నీ జనరల్ ఇచ్చిన అభిప్రాయాన్ని కేంద్రం పాటిస్తుందనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటే.. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేనివిధంగా ఈ రాష్ట్రానికి రాజ్యాంగపరంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 371డీని ముందుగా తొలగించాల్సిందేనని భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారి అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నిన్న కేంద్ర హోంశాఖకు నోట్ సమర్పించిన విషయం తెలిసిందే.