విడిపోయినా ప్రజలు కలిసుండాలి: పళ్లంరాజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలు కలిసుండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు. ఆ దిశగా కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘నవోదయ పాఠశాలల జాతీయ సమగ్రతా సమావేశం’లో శుక్రవారం పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్రప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని, ఈ వేగం తమకూ ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో కేంద్రం ముందు ఎలాంటి వాదనలు వినిపించలేదన్న భావన రాకూడదన్న ఉద్దేశంతోనే మంత్రుల బృందానికి(జీవోఎం) 11 అంశాలపై నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.
తాము సమైక్యంగా ఉండాలని లిఖితపూర్వకంగా రాసిచ్చామని, అయితే విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన అంశాలపై నివేదించామని, ఇంతకుమించి వివరాలు చెప్పలేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్‌కు సంబంధించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్య నడుస్తున్న వివాదంపై తాను వ్యాఖ్యానించబోనని చెప్పారు. విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు చేతులెత్తేయలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరామని, విభజన వద్దని స్పష్టం చేశామని అన్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందా? లేదా? అన్నది తాను చెప్పలేనన్నారు.
నవోదయ పాఠశాలలు పనితీరు అద్భుతం..
దేశంలో నవోదయ విద్యాసంస్థల పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. ‘నవోదయ పాఠశాలల జాతీయ సమగ్రతా సమావేశం’లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడానికి 1986లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. తొమ్మిది, పదో తరగతి చదివే సమయంలో ఒక ప్రాంతంవారు మరో ప్రాంతంలో ఏడాదిపాటు విద్యనభ్యసించడం వల్ల ఆ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు అర్థం చేసుకోవడానికి వీలుంటుందన్నారు.
2022 నాటికి ఐదు కోట్ల మంది యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం తేవడం వల్ల ప్రస్తుతం 23 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారని, వీరిలో 12 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్నభోజన కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీయూ వైస్‌చాన్సలర్ రామకృష్ణ రామస్వామి, నవోదయ విద్యాలయాల కమిషనర్ జీఎస్ భత్యాల్‌లు కూడా ప్రసంగించారు.