సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యం వల్లే కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక ప్రజల మద్దతును మోదీ సర్కార్ కోల్పోయిందని, అందుకే ఇంత పెద్ద దాడిని ఉగ్రవాదులు చేయగలిగారని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి దురదృష్టకరమన్నారు. పాకిస్తాన్ అండతోనే భారత్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. సర్జికల్ దాడులు కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగినట్లు ఎక్కువగా ప్రచారం చేసుకుందని.. కానీ యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.
ఏపీసీసీ భరోసా యాత్ర
ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పల్లం రాజు పేర్కొన్నారు. విభజన హామీలన్నీ అమలయ్యేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కోసం భరోసా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఏపీసీసీ భరోసా యాత్ర అనంతపురం మడకశిరలో ప్రారంభమై.. మార్చి 3 న ఇచ్చాపురంలో ముగుస్తుందన్నారు. అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో భరోసా యాత్ర సాగుతుందని పల్లం రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment