రాష్ట్ర శాసనసభను నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేయాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ రాయటం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభను నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేయాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ రాయటం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆర్డినెన్సులు తీసుకువచ్చేందుకు వీలుగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈమేరకు సీఎంఓ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘అసెంబ్లీ, కౌన్సిల్ ప్రొరోగ్ విషయమై స్పీకర్ కార్యాలయానికి సీఎంఓ లేఖ రాసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం రాసిన లేఖ మాత్రమే.
అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా ఉన్న సమయంలో ఆర్డినెన్సులు తీసుకురావటానికి సాంకేతికంగా వీలుండదు. కొన్ని ఆర్డినెన్సులు తీసుకురావలసిన అవసరమున్నందున ప్రొరోగ్ చేయాలని లేఖ పంపాం. ఇది పరిపాలనా సౌలభ్యం కోసమే’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 21వ తేదీతో ముగిశాయి. దాదాపు ఐదు మాసాలుగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ స్పీకర్‌కు లేఖ రాయని సీఎం కిరణ్.. 15 రోజుల కిందటే ఈ లేఖ రాశారు. మలివిడత సమావేశాలకు వ్యవధి నెల రోజుల్లోపే ఉన్న తరుణంలో, ఈ నెలాఖరుకు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రానున్న సమయంలో ఈ లేఖ సహజంగానే వివాదాన్ని రేపింది.