శ్రీకాకుళం సిటీ: డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వచ్చే వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి ఏటీఎం కార్డు, పిన్‌లను తస్కరిస్తూ నగదు చోరీ చేయడంలో ఆరితేరిన గౌడ రాజారావును నగర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు శనివారం రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. మెళియాపుట్టి మండలం ముక్తంపాలెం గ్రామానికి చెందిన గౌడ రాజా రావు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా శనివారం పోలీసులకు పట్టుబడ్డాడు.
అతనిని విచారించగా శ్రీకాకుళం పట్టణంలో ఏడు, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో రెండు, నరసన్నపేటలో ఒక ఏటీఎం చోరీ కేసులలో రాజారావు పాత్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
గౌడ రాజారావు వ్యవసాయ కార్మికుడు. ఏడేళ్ల క్రితం కుమార్తెకు వివాహం చేశాడు. రాజారావు భార్యకు ఫైలేరియా సోకడంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు.
అయినా ఫలితం లేకపోయింది. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులకు చూపించి భార్యకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఎలాగైనా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో విశాఖపట్నం వెళ్లి కూలీ పనులు సైతం చేశాడు. అయినా పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరకపోవడంతో తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏటీఎంల వద్దకు వచ్చే అమాయక ఖాతాదారులకు మాయమాటలు చెప్పి మోసగించడం అలవాటుగా చేసుకున్నాడు.
రూ.2.50 లక్షల రికవరీ..
శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేటల్లో సుమారు 10 ఏటీఎం కేంద్రాల వద్ద చోరీలకు పాల్పడ్డాడు. డబ్బులు తీయడంలో అవగాహన లేని ఖాతాదారులను గమనించి మాయమాటలు చెప్పి పిన్ తెలుసుకోవడం, ఏటీఎం కార్డులను మార్చడం వంటి పనులు చేసి నగదు కొల్లగొట్టేవాడు. ఇలా మొత్తం రూ.3,12,500 డ్రా చేశాడు. ఎట్టకేలకు శనివారం పోలీసులకు చిక్కాడు. ఇతని వద్ద నుంచి రూ.2.50 లక్షల నగదు, ఐదు ఏటీఎం కార్డులను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తామని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment