కాశీనగర్ (పూండి): వజ్రపుకొత్తూరు మండలం కాశీనగర్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఆటో- ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో నువ్వలరేవు గ్రామానికి చెందిన బైనపల్లి దయానిధి, కాంతమ్మల చివరి కుమారుడు భీమారావు (23) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ దాశరధి, ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి కళ్యాణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పలాస నుంచి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని డ్రైవర్ దాశరథి బయల్దేరాడు.
వజ్రపుకొత్తూరులో కొందరు ప్రయాణికులను దింపేసి..భీమారావుతో కలిసి స్వగ్రామం నువ్వల రేవు వెళుతున్నాడు. మార్గమధ్యలో కాశీనగర్ వద్దకు చేరుకునే సరికి నువ్వల రేవు నుంచి అతి వేగంగా బైక్‌పై వస్తున్న బి.కల్యాణ్ ఆటోను బలంగా ఢీకొన్నాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న భీమారావు రోడ్డుపై పడిపోయాడు. ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై కె.రవికిశోర్ చెప్పారు. ఆటో డ్రైవర్‌తో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
మిన్నంటిన రోదనలు
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగాపెంచుకున్న కుమారుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందంటూ వారు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించామని..అనంతరం తల్లిదండ్రులకు అప్పజెప్పామని తెలిపారు.
ఆటోను ఢీకొన్న బైక్-ఒకరి దుర్మరణం
Published Mon, Sep 8 2014 1:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement