Two-wheeled vehicle
-
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
పుంగనూరు : ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉన్న వేళ పుంగనూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు కలిగిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కోర్టు రూటులో వెళుతుండగా పాల కంటైనర్ అతివేగంగా వచ్చి ఢీకొంది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎస్ఐ హరిప్రసాద్ అక్కడికి చేరుకుని క్షతగాత్రుడినిస్థానిక ఫ్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలు తెలియరాలేదు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ద్విచక్ర వాహనం – కారు ఢీ
కురవి : ఎదురెదురుగా వస్తు న్నద్విచక్రవాహనం, మారుతి కారు ఢీకొన్న ఘటనలో ఇద్ద రు తీవ్రంగా గాయపడిన ఘ టన శుక్రవారం కురవి శివారులోని 365 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వి వరాలిలా ఉన్నాయి.. అబ్బాయిపాలెం శివారు దారావత్ తండాకు చెందిన దారావత్ శ్రీను,దారావత్మనోర్య, రవి ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ నుంచి కురవి వైపు వస్తున్నారు. మరిపెడకు బెజ్జంకి రమేష్ బంగ్లా నుంచి మహబూబాబాద్‌కు మారుతి కారులో వెళ్తుండగా కురవి శివారులోని పెద్ద చెరువు సమీపంలో ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న శ్రీను, మనోర్య తీవ్రంగా గాయపడ్డారు. శ్రీను ఎడమ కాలు రెండు చోట్ల విరిగి నుజ్జునుజ్జయింది. మనోర్య ఎడమ కాలు విరిగింది. రవి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. క్షతగాత్రులను కురవి ఎస్సై జె.రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆటోలో మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
ఆపరేషన్‌కు అరగంట ముందు...
ఆగిన సాయి గుండె జీవన్‌దాన్‌కు ఉపయోగపడని అవయవాలు అంతులేని శోకం తన బిడ్డ మరణించినా నలుగురుబిడ్డలకు బతుకు నివ్వాలనుకున్న ఆ పేద తల్లికి దేవుడు ఆ తృప్తినీ మిగల్చలేదు. మరో అరగంటలో తన బిడ్డ శరీర భాగాలతో నలుగురికి ఆయుష్షు లభిస్తుందని భావించిన ఆ తల్లికి అంతులేని శోకమే మిగిలింది. విడవలూరు కామాక్షి సెంటర్‌కు చెందిన వెంకటరమణమ్మకు విధి తీరని దుఃఖాన్ని కలిగించింది. సాక్షి ప్రతినిధి - నెల్లూరు: విడవలూరులో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో గంగపట్నం రవీంద్ర (35), అతని కొడుకు సాయి (8) తీవ్రంగా గాయపడ్డారు. భర్త, బిడ్డను బతికించుకోవడానికి వెంకటరమణమ్మ, వారి బంధువులు ఎంతో ఆరాట పడ్డారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి నారాయణ వైద్య కళాశాలకు వీరిని తరలించారు. తన భర్త, బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ ఇల్లాలు కోటి దేవుళ్లను వేడుకుంది. అయితే బిడ్డ బతికే పరిస్థితి లేదనే విషయం మంగళవారం సాయంత్రం డాక్టర్లు బంధువుల ద్వారా వెంకటరమణమ్మకు తెలియజేశారు. బిడ్డ ఎలాగూ చనిపోతాడని, అతని శరీరంలోని గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు తీసి నలుగురు బిడ్డలకు ఆయుష్షు పోద్దామని డాక్టర్లు ఆ తల్లిని కోరారు. సాయి బతకడనే విషయం చెప్పడంతో కుప్పకూలిన ఆమెను బంధువులు అవయవదానం చేయడానికి అంగీకరింప చేశారు. తన శోకం నలుగురు తల్లులకు ఆనందం ఇస్తుందనే ఉదారతతో పుట్టెడు దుఃఖంలో కూడా కొడుకు అవయవదానానికి ఆ తల్లి అంగీకరించింది. చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రిలో ఊపిరి తిత్తులు, గుండె కోసం ఎదురు చూస్తున్న చిన్నారులకు, విశాఖపట్నం కేర్ ఆసుపత్రిలో లివర్ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న మూడేళ్ల చిన్నారికి సాయి లివర్‌ను పంపడానికి డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. నారాయణ వైద్య కళాశాలలో కిడ్నీల దాత కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు కిడ్నీలు దానం ఇవ్వడానికి వైద్యులు సంకల్పించారు. దీంతో పాటు నెల్లూరు మోడరన్ ఐకేర్ సెంటర్‌కు సాయి నేత్రాలు పంపడానికి సంకల్పించారు. జీవన్‌దాన్ సంస్థ సహకారంతో ఈ అవయవాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆయా ఆసుపత్రులకు నుంచి వైద్య బృందాలు నారాయణ వైద్య కళాశాలకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 1.30 గంటలకు ఆపరేషన్ చేసి సాయి శరీర భాగాలను వేరు చేసి గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాలకు చేరవేయడానికి అనువుగా ట్రాఫిక్‌ను ఆపివేయడానికి పోలీసుల సహకారం కూడా కోరారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న సమయంలో కృత్రిమ శ్వాస మీద ఉన్న సాయి గుండె రాత్రి 1 గంటకు పని చేయడం ఆగిపోయింది. దీంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సంతృప్తీ మిగల్లేదు బిడ్డ తనకు దూరమైనా అతని శరీర భాగాలు నలుగురికి జీవం ఇస్తాయని ఆశించిన సాయి తల్లి వెంకటరమణమ్మకు ఆ సంతృప్తి కూడా మిగల్లేదు. బిడ్డ గుండె ఆగిపోయిందని, శరీర భాగాలు తీయాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి శోకాన్ని ఆపడం బంధువుల తరం కాలేదు. ఒక వైపు భర్త ప్రాణాపాయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వైపు బిడ్డ చనిపోయాడు. ఈ పరిస్థితి కూలీ నాలీ చేసుకుని బతికే ఆ కుటుంబానికే ఎందుకు వచ్చిందని బంధువులు సైతం కంట తడిపెట్టారు. బుధవారం ఉదయం బిడ్డ దేహాన్ని తీసుకుని బంధువులు, తల్లి విడవలూరు వెళ్లారు. ఆ బిడ్డకు అంత్యక్రియలు పూర్తి చేయించారు. మద్యం మత్తే ఆ కుటుంబానికి శాపం వళ్లు తెలియకుండా మద్యం సేవించి ద్విచక్ర వాహనం మీద ఆదివారం సాయంత్రం విడవలూరు నుంచి నెల్లూరు వైపు ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చిన కొడవలూరు మండలం వేగూరుకు చెందిన షేక్ దస్తగిరి రోడ్డుపక్కనే ఉన్న రవీంద్ర, అతని కొడుకు సాయిను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో దస్తగిరి, అతని వెనుక కూర్చుని ఉన్న మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. చావు బతుకుల్లోకి వెళ్లిన తండ్రీ, కొడుకులు ఆసుపత్రికి చేరారు. ఏడేళ్లు నిండకుండానే చిన్నారి సాయి బతుకు చాలించాడు. తండ్రి రవీంద్ర విషమ పరిస్థితిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. -
పాపం సాకేత్!
బరి తెగింపు.. ఎవరేమి చేస్తారులే అనే బలుపు.. వెంటాడి లాగేద్దాం వస్తే గొలుసులు.. పోతే ప్రాణాలు అన్నట్లు.. చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. గురువారం ఒక్క రాత్రే ఒక్క రాజేంద్రనగర్ పరిసరాల్లో కేవలం గంటన్నరలో మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. పాపం ఓ చిన్నారి తీవ్రంగా గాయపడడం విచారకరం. రాజేంద్రనగర్: రోజురోజుకీ బరితెగిస్తున్న స్నాచర్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మెడలో ఉన్న గొలుసుల్ని లాగే క్రమంలో తీవ్రంగా గాయపడుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉస్మానియా వర్శిటీ పరిధిలో ఏకంగా ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగిన వరుస స్నాచింగ్స్లో ఏడాదిన్నర వయస్సున్న సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నాచర్లు పంజా విసిరే సమయంలో వాహనంపై ప్రయాణిస్తున్న తల్లిఒడిలో నిద్రిస్తున్న ఈ పసివాడు తల్లితో సహా కిందపడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 8.30 నుంచి 10 గంటల మధ్య మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదర్‌గూడకు చెందిన చంద్రశేఖర్ తన భార్య లావణ్య, కుమారుడు సాకేత్‌లతో కలిసి పల్లెచెర్వులో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆరామ్‌ఘర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు లావణ్య మెడలోని మూడు తులాలు బంగారు గొలుసు లాగేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఉదంతంతో అదుపు తప్పిన లావణ్య ఒడిలోని బిడ్డతో సహా రోడ్డుపై పడిపోయారు. దీంతో లావణ్యకు స్వల్ప గాయాలు కాగా.. సాకేత్ ఎడమ కాలు విరగడంతో పాటు ముఖానికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. స్నాచింగ్ విషయం చెప్తున్న పోలీసులు బాలుడికి గాయాలైన విషయాన్ని మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. మరో రెండు ఘటనల్లో... శివరామ్పల్లికి చెందిన విజయ్ తన భార్య లలితతో కలిసి పల్లెచెర్వులో బతుకమ్మ సంబరాలకు హాజరై తిరిగి వస్తున్నారు. పల్లెచెర్వు దాటిని కొద్దిసేపటికే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లలిత మెడలోని 2.5 తులాల పుస్తెలతాడు తాక్కుని ఉడాయించారు. హైదర్‌గూడకు చెందిన వెంకటయ్య తన భార్య సంతోషితో కలిసి స్థానికంగా ఉన్న సాయిబాబ దేవాలయానికి వెళ్ళారు తిరిగి వస్తున్న సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంతోషి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు. మహిళ మెడలో గొలుసు మాయం కుత్బుల్లాపూర్: ఆటోలో మాయ లేడీలు ఓ మహిళ మెడ నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముండే శశికళ ఐడీపీఎల్ ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం షాపూర్‌నగర్ నుంచి ఆటోలో బ్యాంక్‌కు బయలుదేరారు. ఆ సమయంలో ముఖాలకు స్కార్ఫ్‌లు కట్టుకున్న ముగ్గురు మహిళలు చుట్టూ పోగై పథకం ప్రకారం మెడలో ఉన్న సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే ఐదు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. బ్యాంక్‌కు వెళ్లిన శశికళ మెడలో పుస్తెలతాడు లేకపోవడంతో తోటి ఉద్యోగులు అడగ్గా ఆమె గొలుసు పోయిన విషయం గుర్తించి షాకయ్యారు. ఈ విషయంపై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటో నడిపిన వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్ బంజారా హిల్స్: ఇంటి ముందు నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తస్కరించిన ఘటన శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొలీసులు తెలిపిన వివరాలు.. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్లారెడ్డిగూడ ఆర్ బీఐ క్వార్టర్స్ ఎదురుగా నివసించే విజయలక్ష్మి (44) అనే మహిళ శుక్రవారం రాత్రి 9 సమయంలో భోజనం చేసి వచ్చి ఇంటి ముందు నిలబడింది. అమె నిలబడ్డ రెండు మూడు నిమిషాలకే నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. ఒక్క ఉదుటన గొలుసు లాగడంతో ఆమె కింద పడి పోయింది. ఆమె కేకలు విని కుటుంబం సభ్యులు బయటకు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కీం పేరిట కుచ్చుటోపి
- బోర్డు తిప్పేసిన ఎస్సారార్ ఫైనాన్స్ - మోసపోయిన 540 మంది - పోలీసులకు ఫిర్యాదు సాక్షి, మంచిర్యాల : అంతా చిరు వ్యాపారులు, చిరుద్యోగులు.. ఒకేసారి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని వారే. ఇక్కడే వీరి అశక్తతను సొమ్ము చేసుకుందామనుకున్న కొందరు దుకాణం తెరిచారు. ‘నెలకు కొంత చెల్లిస్తే చాలు.. ప్రతీనెలా డ్రాలో గెలిచిన వారికి ద్విచక్ర వాహనం ఇస్తాం, ఆ తర్వాత డబ్బు కట్టనవడం లేదు.. ఇక డ్రా రాని వారికి కాలపరిమితి ముగిశాక మొత్తం డబ్బు ఇచ్చేస్తాం’ ఇలాంటి ప్రచారంతో పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి.. సుమారు రూ.2కోట్లతో ఉడాయించిన వైనమిది. మంచిర్యాలలో ఎస్సారార్ హైర్‌పర్చేస్ అండ్ ఫైనా న్స్ పేరిట జరిగిన ఈ మోసాన్ని గుర్తించిన పలువురు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. 36 నెలలు.. నెలకు రూ.1390.. మంచిర్యాల పట్టణం బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఎస్సారార్ మోటార్ క్రెడిట్ పేరిట స్కీంను 2012లో 299 మంది సభ్యులతో ప్రారంభించారు. సభ్యులు నెలకు రూ.1390 చెల్లిస్తే డ్రాలో ఎంపికైన వారికి రూ. 40,040 తిరిగి ఇస్తామని చెప్పారు. డ్రాలో ఎంపికైన తర్వాత వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రచారం చేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నమ్మారు. తర్వాత అవే షరతులు.. నిబంధనలతో మే 2013లో 299 మందితో మరో స్కీం ప్రారంభిం చారు. రెండు స్కీంల్లో గత నెల వరకు 58 మందిని డ్రాలో ఎంపిక చేశారు. ఇలా సాగుతుండగా.. వాయి దాలు చెల్లించేందుకు కొందరు కార్యాలయానికి గత నెలలో వెళ్తే తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసి నా నిర్వాహకులు స్పందించకపోవడంతో ఆదివా రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫైనాన్స్ నిర్వాహకులు పంజాల రాజు, వంగర సు మంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. ఫైనాన్స్ నిర్వాహకులు పంజాల రాజు 20 రోజుల క్రితమే స్థానిక సీసీసీలోని తన ఇం టికి తాళం వేసి పరారయ్యాడని.. మరో భాగస్వామి వంగతి సుమంత్ రెండు నెలల కిత్రమే తన సొంత ఊరు తెనాలి వెళ్లిపోయాడని తెలుస్తోంది. కాగా, డ్రా లో గెలిచిన వారిలో కొందరికి ఇంకా బైక్‌లు ఇవ్వలేదని చెబుతున్నారు. మొదటి స్కీం కింద ఇప్పటి వ రకు 267 మంది(డ్రాలో ఎంపికైన 32 మంది మి నహా) రూ.1,390 చొప్పున రూ.1,18,76,160 చె ల్లించారు. రెండో స్కీం కింద 273 మంది (డ్రాలో ఎంపికైన 26 మంది మినహా) రూ.98,66,220 చె ల్లించారు. రెండు స్కీంలు కలిపి నిర్వాహకులు రూ. 2.30 కోట్ల పైగానే వసూలు చేసినట్లు అంచనా. కానీ 58 మందికే రూ.40,040 చొప్పున రూ. 23,22,320 మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు పోలీసు లు సత్వరమే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. నమ్మి మోసపోయా... నేను సీసీసీలో చిన్న షాపు పెట్టుకుని జీవిస్తున్నా. నెలకు కొంత డబ్బు వెనకేసుకుందామనే ఆలోచనతో పాటు వాహనం తీసుకుందామనే ఉద్దేశ్యంతో నెలకు రూ.1390 ఎస్సారార్‌లో చెల్లించా. ఇప్పటి వరకు 31 నెలల పాటు రూ. 43,090 కట్టాను. ప్రతినెలా ఎవరో ఒకరు డ్రా లో గెలుస్తుండగా, వారిలో కొందరికి ఇంకా బైక్ ఇయ్యలే. ఇప్పటికీ వాళ్లు ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతలో నేను 32వ నెల వాయిదా చెల్లిద్దామని వస్తే ఆఫీసుకు వెళితే బంద్ ఉంది. ఆరా తీస్తే రాజు, సుమంత్ పారిపోయారని తెలిసింది. దీంతో మరికొందరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా. - కె.యాదగిరి, సీసీసీ -
మృత్యుహేల
ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి టిప్పర్: మోటార్ సైకిల్ ఢీ సకాలంలో రాని బస్సులు తప్పనిసరై ద్విచక్ర వాహనాలపై విద్యార్థుల పయనం సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: నగర శివారులో రహదారులు మరోసారి రక్తసిక్తమయ్యాయి. ముగ్గురు విద్యార్థులను బలిగొన్నాయి. సకాలంలో బస్సులు లేక... కళాశాల నుంచి ఎలాగోలా ఇళ్లకు చేరుకోవాలనే ఆత్రంలో... ద్విచక్ర వాహనంలో బయలుదేరిన ముగ్గురు మిత్రులు మృత్యువాతపడ్డారు. నగరంలోని విద్యార్థుల సంఖ్యకు సరిపడే స్థాయిలో బస్సులు లేవన్న నిజానికి సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ సంఘటనకు సంబంధించి సహచర విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.... మేడ్చెల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ (21), మణిదీప్ గౌడ్ (21), రాజేందర్ రెడ్డి (21) గురువారం ఒకే ద్విచక్ర వాహనం (యమహా)పై వస్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వీరు ముగ్గురూ కళాశాల నుంచి ఇళ్లకు బయలుదేరారు. రాజేందర్‌రెడ్డి తన వాహనాన్ని నడుపుతుండగా...మణిదీప్, శ్రీకాంత్‌లు వెనుక కూర్చున్నారు. సరిగ్గా 4 గంటల సమయంలో వారు కొంపల్లి చంద్రారెడ్డి గార్డెన్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో ఓ లారీ అక్కడ యూ టర్న్ తీసుకుంటోంది. మరో టిప్పర్ వేగంగా దూసుకొస్తోంది. ఈ రెండు భారీ వాహనాలకు ఎదురుగా వస్తున్న విద్యార్థుల వాహనం మేడ్చెల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తోంది. మోటార్ సైకిల్ నడుపుతున్న రాజేందర్‌రెడ్డి ఆ రెండు భారీ వాహనాలను తప్పించబోయి టిప్పర్‌ను ఢీ కొట్టాడు. ముగ్గ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగిలిపోయాయి. శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే గాయపడిన మణిదీప్ గౌడ్, రాజేందర్‌రెడ్డిలను 108 వాహనంలో పేట్ బషీరాబాద్ బాలాజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేందర్‌రెడ్డి, మణిదీప్‌లు తుది శ్వాస విడిచారు. బస్సులు లేకనే... అల్వాల్ లోతుకుంట ప్రాంతానికి చెందిన మణిదీప్‌గౌడ్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తండ్రి బాలాగౌడ్ మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి జయశ్రీ కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ కొడుకును చదివిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన దేవేందర్‌రెడ్డి కుమారుడు రాజేందర్‌రెడ్డి అల్వాల్‌లోనే స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. బొల్లారంలోని ఏఆర్కే హోమ్ ప్రాంతానికి చెందిన రఘువరన్ కుమారుడు శ్రీకాంత్(21). ఈ ముగ్గురూ కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నిత్యం రాజేందర్‌రెడ్డి వాహనంపై మణిదీప్ కానీ, శ్రీకాంత్ కానీ ఒక్కరు మాత్రమే వెళ్తుంటారు. గురువారం మాత్రం ఒకే వాహనంపై ముగ్గురూ కలసి బయలుదేరారు. మార్గమధ్యలోనే మృత్యువుకు చిక్కారు. ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తాము కళాశాలకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు ఉండి ఉంటే... ఇలా బైక్‌లపై వె ళ్లి ప్రమాదాల బారిన పడాల్సిన అవసరం ఉండదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాది మంది విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారని... బస్సులు పరిమితంగా ఉండడంతో గత్యంతరం లేక సెవెన్‌సీటర్, షేరింగ్ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... ప్రమాద సంఘటనపై పేట్ బషీరాబాద్ సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించారు. ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత మేడ్చెల్, మైసమ్మగూడ,దూలపల్లి, గుండ్లపోచంపల్లి, శామీర్‌పేట్, గౌడెల్లి, రాయిలాపూర్ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. నగరంలో ని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కళాశాలలకు వెళ్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళ ల్లో ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నీ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటాయి. బస్సులు లేకపోవడంతో చాలా మంది ద్విచక్ర, ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 90 రోడ్డు ప్రమాదాలు సంభవించగా... వీరిలో 15 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. -
బైక్ ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య
మడికొండ : ద్విచక్ర వాహనం తాళం చెవి ఇవ్వలేదని పురుగుల మందు తాగి బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హన్మకొండ మండలంలోని ముల్కలగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికులు, గ్రామస్తుల కథ నం ప్రకారం.. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎండిగ రవీందర్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మహేష్(13) ఉన్నారు. మంగళవారం ఉదయం మహేష్ తన తండ్రి రవీందర్‌ను బైక్ నడుపుతానని తాళం చెవి ఇవ్వమని కోరాడు. తండ్రి తాళం చెవి ఇవ్వకపోవడంతో కలతచెందిన మహేష్ ఇంట్లో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి రవీందర్‌కు సమాచారమిచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలిచగా చికిత్సపొందుతు మృతిచెందాడు. మహేష్ చురుగ్గా ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
150 సీసీ బైక్స్.. స్మార్ట్ రైడర్స్!
- కొనే ముందే మోడళ్లపై కసరత్తు - అత్యుత్తమమైతేనే రైడింగ్‌కు సై - దేశంలో నెలకు 80 వేల బైక్‌ల విక్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనమనగానే తొలుత గుర్తొచ్చేది మైలేజీ. అదే 150 సీసీ స్పోర్ట్ బైక్‌ల విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అసలే యువ కస్టమర్లు. భిన్నమైన అభిరుచులు. వీరికి కావాల్సిందల్లా అత్యాధునిక టెక్నాలజీతో పవర్ఫుల్ మోడల్. ఇతర మోడళ్లకు ధీటుగా, ఆకర్షణీయంగా ఉండాల్సిందే. బైక్ గురించి పూర్తిగా అధ్యయనం చేశాకే కస్టమర్లు రైడ్‌కు సై అంటున్నారట. ఇందుకోసం రైడర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారని వాహన కంపెనీలు అంటున్నాయి. ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలు టెస్ట్ రైడ్ వరకు అదో పెద్ద పరీక్షేనని చెబుతున్నాయి. భారత్‌లో 150 సీసీ విభాగంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు సుమారు 80 వేల బైక్‌లు అమ్ముడవుతున్నాయి. బైక్‌లపై అవగాహన.. మార్కెట్లోకి ఎటువంటి బైక్‌లు వస్తున్నాయి. వాటి సామర్థ్యమెంత. అంతర్జాతీయంగా ఏ మోడల్‌ను ఆధారంగా చేసుకుని డిజైన్ చేశారు. ఎటువంటి టెక్నాలజీని వాడారు వంటి ప్రశ్నలకు సమాధానం కస్టమర్ల వద్దే ఉంటోందని అంటున్నారు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మార్కెటింగ్ నేషనల్ హెడ్ అను అనామిక. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించడంలో 18-25 ఏళ్ల యువ రైడర్లు ముందుంటున్నారని వివరించారు. 100 సీసీ అంటే మైలేజీ, 125 సీసీ మైలేజీతోపాటు కొంచెం స్టైల్ అన్న భావన కస్టమర్లలో ఉందన్నారు. ‘150 సీసీ విషయంలో మాత్రం స్టైల్, పవర్, టెక్నాలజీయే గీటురాయి. బ్రాండ్ కూడా ప్రాధాన్య అంశమే. కంపెనీల మధ్య అత్యంత పోటీ విభాగమి ది. కస్టమర్లను మెప్పిం చడం చాలా కష్టం’ అని చెప్పారు. ఇప్పుడు మైలేజీ అధికంగా ఇచ్చే బైక్‌లూ వస్తున్నాయని తెలిపారు. మొత్తంగా అత్యుత్తమమైతేనే బైక్‌ను కొంటారని అన్నారు. కొత్త మోడళ్లు వస్తున్నాయ్.. 150 సీసీ బైక్‌ల విక్రయాల్లో 50 శాతం వాటాతో బజాజ్ పల్సర్ అగ్రస్థానంలో ఉంది. బజాజ్ డిస్కవర్లోనూ 150 సీసీ మోడళ్లున్నాయి. హోండా యునికార్న్, సీబీఆర్ 150ఆర్, యమహా ఫేజర్, ఎఫ్‌జడ్-ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160(ఇది 160 సీసీ), హీరో ఎక్స్ట్రీమ్, హంక్, అచీవర్, సుజుకి జిక్సర్(155 సీసీ), జీఎస్ 150-ఆర్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. సుజుకి ఇటీవల విడుదల చేసిన జిక్సర్ సిరీస్‌లో కమ్యూటర్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. అలాగే హీరో మోటో 150 సీసీతో కొత్త బైక్‌ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోతోంది. హోండా కూడా కమ్యూటర్ బైక్‌ను తీసుకొస్తోంది. అయితే ఇంజిన్ సామర్థ్యం 160 సీసీ ఉండొచ్చని సమాచారం. 2 శాతం అధికం.. భారత్‌లో నెలకు 13.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో స్కూటర్లు 26 శాతం వాటాతో 3.5 లక్షల యూనిట్లుంది. మోటార్ సైకిళ్ల అమ్మకాల వృద్ధి రేటు 10-12 శాతముంది. సాధారణ బైక్‌లతో పోలిస్తే 150 సీసీ బైక్‌ల అమ్మకాల వృద్ధి రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగుతుందని బజాజ్ మోటార్ సైకిల్ విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 100, 125 సీసీతో పోలిస్తే 150 సీసీ విభాగం వృద్ధి రేటు ప్రస్తుతం 2 శాతం అదనంగా ఉందని అన్నారు. ఈ విభాగంలో సగం కస్టమర్లు 100, 125 సీసీ నుంచి అప్‌గ్రేడ్ అయితే, మిగిలిన సగం మంది తొలిసారిగా బైక్‌ను కొనేవారుంటున్నారని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్త తెలిపారు. జిక్సర్ ద్వారా 150 సీసీ బైక్‌ల విభాగంలో 10 శాతం మార్కెట్ వాటాను మార్చినాటికి దక్కించుకుంటామని పేర్కొన్నారు. -
ఆటోను ఢీకొన్న బైక్-ఒకరి దుర్మరణం
కాశీనగర్ (పూండి): వజ్రపుకొత్తూరు మండలం కాశీనగర్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఆటో- ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో నువ్వలరేవు గ్రామానికి చెందిన బైనపల్లి దయానిధి, కాంతమ్మల చివరి కుమారుడు భీమారావు (23) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ దాశరధి, ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి కళ్యాణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పలాస నుంచి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని డ్రైవర్ దాశరథి బయల్దేరాడు. వజ్రపుకొత్తూరులో కొందరు ప్రయాణికులను దింపేసి..భీమారావుతో కలిసి స్వగ్రామం నువ్వల రేవు వెళుతున్నాడు. మార్గమధ్యలో కాశీనగర్ వద్దకు చేరుకునే సరికి నువ్వల రేవు నుంచి అతి వేగంగా బైక్‌పై వస్తున్న బి.కల్యాణ్ ఆటోను బలంగా ఢీకొన్నాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న భీమారావు రోడ్డుపై పడిపోయాడు. ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై కె.రవికిశోర్ చెప్పారు. ఆటో డ్రైవర్‌తో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మిన్నంటిన రోదనలు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగాపెంచుకున్న కుమారుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందంటూ వారు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించామని..అనంతరం తల్లిదండ్రులకు అప్పజెప్పామని తెలిపారు.