ఆపరేషన్‌కు అరగంట ముందు...
ఆగిన సాయి గుండె
జీవన్‌దాన్‌కు ఉపయోగపడని అవయవాలు
అంతులేని శోకం
తన బిడ్డ మరణించినా నలుగురుబిడ్డలకు బతుకు నివ్వాలనుకున్న ఆ పేద తల్లికి దేవుడు ఆ తృప్తినీ మిగల్చలేదు. మరో అరగంటలో తన బిడ్డ శరీర భాగాలతో నలుగురికి ఆయుష్షు లభిస్తుందని భావించిన ఆ తల్లికి అంతులేని శోకమే మిగిలింది. విడవలూరు కామాక్షి సెంటర్‌కు చెందిన వెంకటరమణమ్మకు విధి తీరని దుఃఖాన్ని కలిగించింది.
సాక్షి ప్రతినిధి - నెల్లూరు: విడవలూరులో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో గంగపట్నం రవీంద్ర (35), అతని కొడుకు సాయి (8) తీవ్రంగా గాయపడ్డారు. భర్త, బిడ్డను బతికించుకోవడానికి వెంకటరమణమ్మ, వారి బంధువులు ఎంతో ఆరాట పడ్డారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి నారాయణ వైద్య కళాశాలకు వీరిని తరలించారు. తన భర్త, బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ ఇల్లాలు కోటి దేవుళ్లను వేడుకుంది. అయితే బిడ్డ బతికే పరిస్థితి లేదనే విషయం మంగళవారం సాయంత్రం డాక్టర్లు బంధువుల ద్వారా వెంకటరమణమ్మకు తెలియజేశారు. బిడ్డ ఎలాగూ చనిపోతాడని, అతని శరీరంలోని గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు తీసి నలుగురు బిడ్డలకు ఆయుష్షు పోద్దామని డాక్టర్లు ఆ తల్లిని కోరారు. సాయి బతకడనే విషయం చెప్పడంతో కుప్పకూలిన ఆమెను బంధువులు అవయవదానం చేయడానికి అంగీకరింప చేశారు.
తన శోకం నలుగురు తల్లులకు ఆనందం ఇస్తుందనే ఉదారతతో పుట్టెడు దుఃఖంలో కూడా కొడుకు అవయవదానానికి ఆ తల్లి అంగీకరించింది. చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రిలో ఊపిరి తిత్తులు, గుండె కోసం ఎదురు చూస్తున్న చిన్నారులకు, విశాఖపట్నం కేర్ ఆసుపత్రిలో లివర్ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న మూడేళ్ల చిన్నారికి సాయి లివర్‌ను పంపడానికి డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. నారాయణ వైద్య కళాశాలలో కిడ్నీల దాత కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు కిడ్నీలు దానం ఇవ్వడానికి వైద్యులు సంకల్పించారు. దీంతో పాటు నెల్లూరు మోడరన్ ఐకేర్ సెంటర్‌కు సాయి నేత్రాలు పంపడానికి సంకల్పించారు. జీవన్‌దాన్ సంస్థ సహకారంతో ఈ అవయవాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు.
ఆయా ఆసుపత్రులకు నుంచి వైద్య బృందాలు నారాయణ వైద్య కళాశాలకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 1.30 గంటలకు ఆపరేషన్ చేసి సాయి శరీర భాగాలను వేరు చేసి గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాలకు చేరవేయడానికి అనువుగా ట్రాఫిక్‌ను ఆపివేయడానికి పోలీసుల సహకారం కూడా కోరారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న సమయంలో కృత్రిమ శ్వాస మీద ఉన్న సాయి గుండె రాత్రి 1 గంటకు పని చేయడం ఆగిపోయింది. దీంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆ సంతృప్తీ మిగల్లేదు
బిడ్డ తనకు దూరమైనా అతని శరీర భాగాలు నలుగురికి జీవం ఇస్తాయని ఆశించిన సాయి తల్లి వెంకటరమణమ్మకు ఆ సంతృప్తి కూడా మిగల్లేదు. బిడ్డ గుండె ఆగిపోయిందని, శరీర భాగాలు తీయాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి శోకాన్ని ఆపడం బంధువుల తరం కాలేదు. ఒక వైపు భర్త ప్రాణాపాయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వైపు బిడ్డ చనిపోయాడు. ఈ పరిస్థితి కూలీ నాలీ చేసుకుని బతికే ఆ కుటుంబానికే ఎందుకు వచ్చిందని బంధువులు సైతం కంట తడిపెట్టారు. బుధవారం ఉదయం బిడ్డ దేహాన్ని తీసుకుని బంధువులు, తల్లి విడవలూరు వెళ్లారు. ఆ బిడ్డకు అంత్యక్రియలు పూర్తి చేయించారు.
మద్యం మత్తే ఆ కుటుంబానికి శాపం
వళ్లు తెలియకుండా మద్యం సేవించి ద్విచక్ర వాహనం మీద ఆదివారం సాయంత్రం విడవలూరు నుంచి నెల్లూరు వైపు ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చిన కొడవలూరు మండలం వేగూరుకు చెందిన షేక్ దస్తగిరి రోడ్డుపక్కనే ఉన్న రవీంద్ర, అతని కొడుకు సాయిను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో దస్తగిరి, అతని వెనుక కూర్చుని ఉన్న మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. చావు బతుకుల్లోకి వెళ్లిన తండ్రీ, కొడుకులు ఆసుపత్రికి చేరారు. ఏడేళ్లు నిండకుండానే చిన్నారి సాయి బతుకు చాలించాడు. తండ్రి రవీంద్ర విషమ పరిస్థితిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు.