మృత్యుహేల | Three engineering students died | Sakshi
Sakshi News home page

మృత్యుహేల

Published Thu, Nov 20 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

మృత్యుహేల

మృత్యుహేల

ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
టిప్పర్: మోటార్ సైకిల్ ఢీ
సకాలంలో రాని బస్సులు
తప్పనిసరై ద్విచక్ర వాహనాలపై విద్యార్థుల పయనం

 
సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: నగర శివారులో రహదారులు మరోసారి రక్తసిక్తమయ్యాయి. ముగ్గురు విద్యార్థులను బలిగొన్నాయి. సకాలంలో బస్సులు లేక... కళాశాల నుంచి ఎలాగోలా ఇళ్లకు చేరుకోవాలనే ఆత్రంలో... ద్విచక్ర వాహనంలో బయలుదేరిన ముగ్గురు మిత్రులు మృత్యువాతపడ్డారు. నగరంలోని విద్యార్థుల సంఖ్యకు సరిపడే స్థాయిలో బస్సులు లేవన్న నిజానికి సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ సంఘటనకు సంబంధించి సహచర విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.... మేడ్చెల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ (21), మణిదీప్ గౌడ్ (21), రాజేందర్ రెడ్డి (21) గురువారం ఒకే ద్విచక్ర వాహనం (యమహా)పై వస్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వీరు ముగ్గురూ కళాశాల నుంచి ఇళ్లకు బయలుదేరారు. రాజేందర్‌రెడ్డి తన వాహనాన్ని నడుపుతుండగా...మణిదీప్, శ్రీకాంత్‌లు వెనుక కూర్చున్నారు. సరిగ్గా 4 గంటల సమయంలో వారు కొంపల్లి చంద్రారెడ్డి గార్డెన్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో ఓ లారీ అక్కడ యూ టర్న్ తీసుకుంటోంది. మరో టిప్పర్ వేగంగా దూసుకొస్తోంది. ఈ రెండు భారీ వాహనాలకు ఎదురుగా వస్తున్న విద్యార్థుల వాహనం మేడ్చెల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తోంది. మోటార్ సైకిల్ నడుపుతున్న రాజేందర్‌రెడ్డి ఆ రెండు భారీ వాహనాలను తప్పించబోయి టిప్పర్‌ను ఢీ కొట్టాడు. ముగ్గ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగిలిపోయాయి. శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే గాయపడిన మణిదీప్ గౌడ్, రాజేందర్‌రెడ్డిలను 108 వాహనంలో పేట్ బషీరాబాద్ బాలాజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేందర్‌రెడ్డి, మణిదీప్‌లు తుది శ్వాస విడిచారు.

 బస్సులు లేకనే...

 అల్వాల్ లోతుకుంట ప్రాంతానికి చెందిన మణిదీప్‌గౌడ్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తండ్రి బాలాగౌడ్ మూడేళ్ల క్రితమే   అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి జయశ్రీ కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ కొడుకును చదివిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన దేవేందర్‌రెడ్డి కుమారుడు రాజేందర్‌రెడ్డి అల్వాల్‌లోనే స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.  బొల్లారంలోని ఏఆర్‌కే హోమ్ ప్రాంతానికి చెందిన రఘువరన్ కుమారుడు శ్రీకాంత్(21).  ఈ ముగ్గురూ కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నిత్యం రాజేందర్‌రెడ్డి వాహనంపై మణిదీప్ కానీ, శ్రీకాంత్ కానీ ఒక్కరు మాత్రమే వెళ్తుంటారు. గురువారం మాత్రం ఒకే వాహనంపై ముగ్గురూ కలసి బయలుదేరారు. మార్గమధ్యలోనే మృత్యువుకు చిక్కారు.    ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తాము కళాశాలకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు ఉండి ఉంటే... ఇలా బైక్‌లపై వె ళ్లి ప్రమాదాల బారిన పడాల్సిన అవసరం ఉండదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాది మంది విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారని... బస్సులు పరిమితంగా ఉండడంతో గత్యంతరం లేక  సెవెన్‌సీటర్, షేరింగ్ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... ప్రమాద సంఘటనపై పేట్ బషీరాబాద్ సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించారు.
 
 
ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత

మేడ్చెల్, మైసమ్మగూడ,దూలపల్లి, గుండ్లపోచంపల్లి, శామీర్‌పేట్, గౌడెల్లి, రాయిలాపూర్ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. నగరంలో ని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కళాశాలలకు వెళ్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళ ల్లో ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నీ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటాయి. బస్సులు లేకపోవడంతో చాలా మంది ద్విచక్ర, ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 90 రోడ్డు ప్రమాదాలు సంభవించగా... వీరిలో 15 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement