150 సీసీ బైక్స్.. స్మార్ట్ రైడర్స్! | Bajaj Auto to launch new 150cc Discover bike in this year | Sakshi
Sakshi News home page

150 సీసీ బైక్స్.. స్మార్ట్ రైడర్స్!

Published Tue, Sep 23 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

150 సీసీ బైక్స్.. స్మార్ట్ రైడర్స్!

150 సీసీ బైక్స్.. స్మార్ట్ రైడర్స్!

- కొనే ముందే మోడళ్లపై కసరత్తు    
- అత్యుత్తమమైతేనే రైడింగ్‌కు సై
- దేశంలో నెలకు 80 వేల బైక్‌ల విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనమనగానే తొలుత గుర్తొచ్చేది మైలేజీ. అదే 150 సీసీ స్పోర్ట్ బైక్‌ల విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అసలే యువ కస్టమర్లు. భిన్నమైన అభిరుచులు. వీరికి కావాల్సిందల్లా అత్యాధునిక టెక్నాలజీతో పవర్‌ఫుల్ మోడల్. ఇతర మోడళ్లకు ధీటుగా, ఆకర్షణీయంగా ఉండాల్సిందే. బైక్ గురించి పూర్తిగా అధ్యయనం చేశాకే కస్టమర్లు రైడ్‌కు సై అంటున్నారట. ఇందుకోసం రైడర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారని వాహన కంపెనీలు అంటున్నాయి. ఇంటర్నెట్‌లో సర్చ్ చేయడం మొదలు టెస్ట్ రైడ్ వరకు అదో పెద్ద పరీక్షేనని చెబుతున్నాయి. భారత్‌లో 150 సీసీ విభాగంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు సుమారు 80 వేల బైక్‌లు అమ్ముడవుతున్నాయి.
 
బైక్‌లపై అవగాహన..
మార్కెట్లోకి ఎటువంటి బైక్‌లు వస్తున్నాయి. వాటి సామర్థ్యమెంత. అంతర్జాతీయంగా ఏ మోడల్‌ను ఆధారంగా చేసుకుని డిజైన్ చేశారు. ఎటువంటి టెక్నాలజీని వాడారు వంటి ప్రశ్నలకు సమాధానం కస్టమర్ల వద్దే ఉంటోందని అంటున్నారు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మార్కెటింగ్ నేషనల్ హెడ్ అను అనామిక. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించడంలో 18-25 ఏళ్ల యువ రైడర్లు ముందుంటున్నారని వివరించారు. 100 సీసీ అంటే మైలేజీ, 125 సీసీ మైలేజీతోపాటు కొంచెం స్టైల్ అన్న భావన కస్టమర్లలో ఉందన్నారు. ‘150 సీసీ విషయంలో మాత్రం స్టైల్, పవర్, టెక్నాలజీయే గీటురాయి. బ్రాండ్  కూడా ప్రాధాన్య అంశమే. కంపెనీల మధ్య అత్యంత పోటీ విభాగమి ది. కస్టమర్లను మెప్పిం చడం చాలా కష్టం’ అని చెప్పారు. ఇప్పుడు మైలేజీ అధికంగా ఇచ్చే బైక్‌లూ వస్తున్నాయని తెలిపారు. మొత్తంగా అత్యుత్తమమైతేనే బైక్‌ను కొంటారని అన్నారు.
 
కొత్త మోడళ్లు వస్తున్నాయ్..
150 సీసీ బైక్‌ల విక్రయాల్లో 50 శాతం వాటాతో బజాజ్ పల్సర్ అగ్రస్థానంలో ఉంది. బజాజ్ డిస్కవర్‌లోనూ 150 సీసీ మోడళ్లున్నాయి. హోండా యునికార్న్, సీబీఆర్ 150ఆర్, యమహా ఫేజర్, ఎఫ్‌జడ్-ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160(ఇది 160 సీసీ), హీరో ఎక్స్‌ట్రీమ్, హంక్, అచీవర్, సుజుకి జిక్సర్(155 సీసీ), జీఎస్ 150-ఆర్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. సుజుకి ఇటీవల విడుదల చేసిన జిక్సర్ సిరీస్‌లో కమ్యూటర్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. అలాగే హీరో మోటో 150 సీసీతో కొత్త బైక్‌ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోతోంది. హోండా కూడా కమ్యూటర్ బైక్‌ను తీసుకొస్తోంది. అయితే ఇంజిన్ సామర్థ్యం 160 సీసీ ఉండొచ్చని సమాచారం.
 
2 శాతం అధికం..
భారత్‌లో నెలకు 13.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో స్కూటర్లు 26 శాతం వాటాతో 3.5 లక్షల యూనిట్లుంది. మోటార్ సైకిళ్ల అమ్మకాల వృద్ధి రేటు 10-12 శాతముంది. సాధారణ బైక్‌లతో పోలిస్తే 150 సీసీ బైక్‌ల అమ్మకాల వృద్ధి రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగుతుందని బజాజ్ మోటార్ సైకిల్ విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 100, 125 సీసీతో పోలిస్తే 150 సీసీ విభాగం వృద్ధి రేటు ప్రస్తుతం 2 శాతం అదనంగా ఉందని అన్నారు. ఈ విభాగంలో సగం కస్టమర్లు 100, 125 సీసీ నుంచి అప్‌గ్రేడ్ అయితే, మిగిలిన సగం మంది తొలిసారిగా బైక్‌ను కొనేవారుంటున్నారని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్త తెలిపారు. జిక్సర్ ద్వారా 150 సీసీ బైక్‌ల విభాగంలో 10 శాతం మార్కెట్ వాటాను మార్చినాటికి దక్కించుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement