న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలైన హీరో మోటోకార్ప్, హోండా సంస్థలు పండుగ సీజన్‌లో పది లక్షల వాహనాల విక్రయాల మైలురాయిని అధిగమించాయి. ఆగస్టు మధ్యలో ప్రారంభమైన పండుగ సీజన్‌లో ఇప్పటిదాకా 10,52,000 ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు హోండా వెల్లడించగా, తాము సైతం ఇప్పటిదాకా మిలియన్ పైగా వాహనాలను విక్రయించినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.
ఇక గత నెల గణాంకాల విషయానికొస్తే.. హీరో మోటోకార్ప్ 6.78% వృద్ధితో రికార్డు స్థాయిలో 7,20,739 ద్విచక్ర వాహనాలు విక్రయించింది. గత సెప్టెంబర్‌లో అమ్మకాలు 6,74,961. నెలవారీగా 7 లక్షల వాహన విక్రయాల మైలురాయి దాటడం ఇదే తొలిసారి అని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అటు హోండా 6,01,998 యూనిట్లు విక్రయించింది.
సెప్టెంబర్‌లో బజాజ్ అమ్మకాలు 14% అప్
మరోవైపు, బజాజ్ ఆటో అమ్మకాలు గత నెలలో 14 శాతం పెరిగాయి. కంపెనీ మొత్తం రూ. 4,28,752 వాహనాలు విక్రయించింది. గతేడాది సెప్టెంబర్‌లో అమ్మకాలు 3,76,765 యూనిట్లు. సెప్టెంబర్‌లో మొత్తం ఎగుమతులు 1,21,173 నుంచి 21 శాతం వృద్ధితో 1,46,973కి చేరాయి.
సుజుకీ మోటార్ కార్ప్‌లో భాగమైన సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో 50,785 వాహనాలు విక్రయించింది. ఎగుమతులు కూడా కలిపితే సుమారు 33 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 57,469 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. అటు, వీఈ కమర్షియల్ వెహికల్స్ (వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్ సంస్థ) గత నెలలో 6,083 వాహనాలు విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment